తెలంగాణ

telangana

By

Published : Jun 7, 2022, 5:15 AM IST

ETV Bharat / business

రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు రెట్టింపు!

India Russia Crude Oil: రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు రెట్టింపు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. రష్యా సంస్థ రోస్‌నెఫ్ట్‌ నుంచి భారీ చౌక ధరకు మరింత ముడి చమురును కొనుగోలు చేసేందుకు దేశీయ ప్రభుత్వ - ప్రైవేటు రంగ రిఫైనరీలు ఆసక్తి చూపుతున్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

India Russia Crude Oil
రష్యా నుంచి రెట్టింపు చమురు దిగుమతి

India Crude Oil Imports: రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను రెట్టింపు చేసుకునే దిశగా భారత్‌ అడుగులు వేస్తున్నట్లు కన్పిస్తోంది. రష్యా సంస్థ రోస్‌నెఫ్ట్‌ నుంచి భారీ చౌక ధరకు మరింత ముడి చమురును కొనుగోలు చేసేందుకు దేశీయ ప్రభుత్వ - ప్రైవేటు రంగ రిఫైనరీలు ఆసక్తి చూపుతున్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని దేశాలు రష్యా నుంచి ముడిచమురు కొనుగోలును ఆపేయాలని నిర్ణయానికి రావడం వల్ల, ఆ మేర చమురును పొందొచ్చని భారత సంస్థలు భావిస్తున్నాయి. కొత్తగా ఆరు నెలల కాలానికి సరఫరా కాంట్రాక్టులు కుదుర్చుకునేందుకు ఈ సంస్థలు సంయుక్తంగా సంప్రదింపులు జరుపుతున్నాయని సమాచారం. సరఫరా బాధ్యతతో పాటు బీమా వ్యవహారాలను కూడా రోస్‌నెఫ్ట్‌ చూసుకోవాల్సి ఉంటుంది.
తాజా ఒప్పందాలు ఖరారైతే, ఇప్పటికే రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేస్తున్న చమురుకు అదనం అవుతుంది. దిగుమతుల పరిమాణం, ధరలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సరఫరాలు అన్నింటికీ ఆర్థికసాయం చేసే భారత బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించాక, రష్యా చమురు దిగుమతులపై అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ పరిణామాన్ని భారత్‌ అనుకూలంగా మలచుకుని, రష్యా నుంచి చౌకగా ముడిచమురును కొనుగోలు చేస్తోంది. తాజాగా రోస్‌నెఫ్ట్‌ లాంటి రష్యా కంపెనీల నుంచి నేరుగా చమురును దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వ రంగ రిఫైనరీలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌తో పాటు ప్రైవేటు సంస్థలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నయర ఎనర్జీ కూడా ఆసక్తిగా ఉన్నాయని సమాచారం.

  • ఫిబ్రవరి నుంచి మే ఆరంభం వరకు రష్యా నుంచి 40 మిలియన్‌ బ్యారెళ్లకు పైగా ముడిచమురును భారత్‌ దిగుమతి చేసుకుంది. 2021 మొత్తం మీద జరిగిన దిగుమతుల కంటే ఇది 20 శాతం ఎక్కువ అని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ఆధారంగా తెలుస్తోంది.
  • మేలో రోజుకు 7,40,000 బ్యారెళ్ల ముడిచమురు భారత్‌కు రష్యా నుంచి సరఫరా అయినట్లు కెప్లెర్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌లో రోజుకు సరఫరా అయిన 2,84,000 బ్యారెళ్ల కంటే ఇది చాలా ఎక్కువ. ఏడాది క్రితం చూస్తే ఇది రోజుకు 34,000 బ్యారెళ్లే.
  • చౌక ధరకే ముడి చమురు కొనుగోలు చేస్తుండటంతో, భారత చమురు దిగుమతులు 2021 ఇదే నెలతో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌లో 16 శాతం పెరిగాయి. రష్యా సహా యూరేషియా ప్రాంతం నుంచి భారత్‌కు చేరుతున్న చమురు వాటా ఈ ఏడాది ఏప్రిల్‌లో 10.6 శాతానికి పెరిగిందని చమురు మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2021 ఏప్రిల్‌లో ఇది 3.3 శాతంగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details