India GDP Growth Rate 2023 : 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్ అంచనాలకు మించి వృద్ధి నమోదు చేసింది. ఈ కాలానికిగాను జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతంగా నమోదైంది. మొత్తంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 7.2గా నమోదైంది. 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధిరేటు 4.5 శాతంగా నమోదుకాగా.. 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో అది 6.1 శాతానికి చేరింది.
2021-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో దేశ వృద్ధిరేటు 4 శాతంగా ఉంది. ఐతే 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి వృద్ధిరేటు 9.1 శాతంగా నమోదైంది. 2022-23 చివరి త్రైమాసికంలో వ్యవసాయ, ఉత్పత్తి, మైనింగ్, నిర్మాణ రంగాలు మెరుగైన పురోగతి సాధించాయని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(NSO) ఈ మేరకు డేటా విడుదల చేసింది. 2022-23లో వృద్ధిరేటు 7 శాతంగా నమోదవుతుందని అంచనాలు ఉండగా అది 7.2 శాతానికి చేరింది. 2023 తొలి మూడు నెలల్లో చైనా వృద్ధిరేటు 4.5 శాతంగా ఉంది.
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోలిస్తే ఉత్పత్తి రంగం 0.6 శాతం పెరిగి 4.5 శాతానికి చేరుకుంది. మైనింగ్ రంగం 4.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 2.3 గా నమోదైంది. నిర్మాణ రంగం గతేడాదిలో 4.9 శాతం ఉండగా.. ఈ త్రైమాసికంలో 10.4 వృద్ధిని నమోదు చేసింది. వ్యవసాయం రంగం 4.1 శాతం నుంచి 5.5 శాతానికి ఎగబాకింది.