India exports 2022: రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఆ సినిమాలాగే భారత ఆర్థిక వ్యవస్థ రికార్డులపై రికార్డులు బద్దలు కొడుతుందన్నారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్లతో భారత ఎగుమతులను పోల్చారు. 2021-22 ఆర్థిక ఏడాదిలో భారత ఎగుమతులు 418 బిలియన్ డాలర్లు దాటాయని, అది గతేడాదితో పోలిస్తే 5 శాతం అధికమని పేర్కొన్నారు. కొవిడ్-19 ప్రతికూలతలు ఉన్నా భారత్ మెరుగైన పనితీరును కనబరిచిందని కొనియాడారు. దిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన గోయల్ ఆర్ఆర్ఆర్ చిత్రం రూ.750 కోట్లు వసూలు చేయటంపై ప్రశంసించారు.
"దేశ చరిత్రలో తొలిసారి 418 బిలియన్ డాలర్లకుపైగా ఎగుమతులు జరిగాయి. కొవిడ్ ఉన్నప్పటికీ లక్ష్యానికి 5 శాతం అధికంగా సాధించాం. ఒక్క మార్చిలోనే 40 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రం రూ.750 కోట్లు వసూళ్లతో దేశంలోనే అతిపెద్ద సినిమాగా నిలిచినట్లు తెలిసింది. అదే విధంగా భారత ఆర్థిక వ్యవస్థ సైతం రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతుందని భావిస్తున్నా."
- పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి.
ఇటీవల భారత సరకుల ఎగుమతుల్లో భారీగా వృద్ధి కనిపించింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ను విస్తరించుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవలే యూఏఈ, ఆస్ట్రేలియాతో కీలక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది భారత్. ఇజ్రాయెల్, ఐరోపా సమాఖ్య, బ్రిటన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి. 2022 చివరి నాటికి పలు ఒప్పందాలు పూర్తవుతాయని కొద్ది రోజుల క్రితం పీయూష్ గోయల్ పేర్కొన్నారు. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజినీరింగ్, రత్నాలు, ఆభరణాలు, రసాయనాలు, ఔషధాలను భారత్ ఎక్కువగా ఎగుమతి చేసింది. భారత్ ఎగుమతుల్లో ఎక్కువ భాగం అమెరికా, అరబ్ ఎమిరేట్స్, చైనా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌కు చేరాయి.
ఆత్మనిర్భర్‌లో కీలక మైలురాయి: భారత దేశ సరకుల ఎగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 418 బిలియన్ డాలర్లకు చేరటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత సరకుల ఎగుమతులు ఏప్రిల్ 2021-ఫిబ్రవరి 2022లో 374.05 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఏప్రిల్2020-ఫిబ్రవరి 2021లోని 256.55 బిలియన్ డాలర్లతో పోలిస్తే 45.80 శాతం అధికం. అలాగే ఏప్రిల్ 2019-ఫిబ్రవరి 2020లోని 291.87 బిలియన్ డాలర్లతో పోలిస్తే 28.16 శాతం అధికం.
భారత వృద్ధి రేటు 7.4 శాతం:2022-23 ఆర్థిక ఏడాదిలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో ధరల పెరుగుదల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల పునరుద్ధరణకు అతిపెద్ద సవాలుగా పేర్కొంటూ ఎకనామిక్ ఔట్లుక్ సర్వేను విడుదల చేసింది. 2022 రెండో అర్ధభాగంలో కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచనుందని అంచనా వేసింది. ఈ ఆర్థిక ఏడాది చివరి నాటికి రెపో రేటు 50-75 బేసిస్ పాయింట్లు పెంచే వీలుందని పేర్కొంది. ఏప్రిల్‌లో జరిగే సమీక్షా సమావేశంలో రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ ఆర్థిక పునరుద్ధరణకు మద్దతుగా నిలవనుందని తెలిపింది.
ఇదీ చూడండి:'ఆ ఒప్పందంతో.. ఏడేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు'