అనుకోని విధంగా జరిగే ప్రమాదాల వల్ల నష్టం వాటిల్లినప్పుడు, బీమా సంస్థలు దాన్ని భర్తీ చేస్తాయి. మానవ తప్పిదాల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలకూ ఇదే సూత్రం వర్తిస్తుందని పలువురు బీమా సంస్థల ప్రతినిధులు తెలిపారు. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించాక, చాలామందికి వాహన బీమా పాలసీలపై సందేహాలు మొదలయ్యాయి. ఈ దుర్ఘటనలో కారు అతివేగంలో ఉండటం, మరణించిన ఇద్దరూ సీటు బెల్టు పెట్టుకోకపోవడం లాంటి పొరపాట్లు ఉన్న నేపథ్యంలో.. వారికి బీమా వర్తిస్తుందా అని తెలుసుకోవడం ప్రారంభించారు.
మత్తులో నడిపితే తిరస్కరణే
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే బీమా మొత్తాన్ని తగ్గించే అవకాశం ఉంది. మద్యం లేదా మత్తుపదార్థాలు తీసుకుని, వాహనాన్ని నడిపినప్పుడు క్లెయింను తిరస్కరించే ఆస్కారం ఉంది. డ్రైవర్ మద్యం సేవించడం, లైసెన్సు లేకుండా నడపడం, పాలసీ వ్యవధి ముగియడం, కారు/వాహనంలో పలు మార్పులు చేయడం, మోసపూరిత క్లెయింలు, సమాచారం ఇవ్వడంలో ఆలస్యం లాంటి సందర్భాల్లోనూ బీమా క్లెయిం తిరస్కరణకు గురవుతుంటాయి.
ఆర్థికంగానే ఆదుకుంటాం
'సాధారణంగా అధిక శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతుంటాయి. ఇలాంటి నష్టాలను భర్తీ చేసేందుకే బీమా సంస్థలు ఉన్నాయి. అనుకోని ఘటనల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేసేందుకే ఎవరైనా బీమా పాలసీలు తీసుకుంటారు. వాహనదారులు సురక్షితంగా వాహనాన్ని నడిపేలా ఎప్పటికప్పుడు వారికి సూచనలు, సలహాల ద్వారా అవగాహన కల్పిస్తుంటాం. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి.. బీమా వల్ల ఆర్థిక నష్టాన్ని మాత్రమే భర్తీ చేయగలం.. ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం' అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ అండర్‌రైటింగ్, క్లెయిమ్స్ సంజయ్ దత్తా అన్నారు.