How to Get Home Renovation Loans:సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే ఇంటిని కొన్న తర్వాత కొన్ని సంవత్సరాలకు అందులో నివసించే వారికి అవసరాలు పెరుగుతాయి. ఇందుకుగాను అదే ఇంట్లో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు. దీనికి ఖర్చవుతుంది. అయితే దీని కోసం బ్యాంకుల నుంచి రెనోవేషన్ లోన్స్ తీసుకోవచ్చని మీకు తెలుసా..?. బ్యాంకులు, నాన్ - బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్‌ఎఫ్‌సీ)లు తమ సాధారణ ఇంటి రుణాలలో భాగంగా ఇంటి రెనోవేషన్ లోన్స్నుఅందిస్తున్నాయి.
మార్పులు, ఉపయోగాలు:వంట గది, బాత్రూమ్ రీమోడలింగ్, కొత్త గది నిర్మాణం లాంటివి చేయొచ్చు. మెరుగైన లైటింగ్ కోసం వెంటిలేషన్‌లో మార్పులు చేయవచ్చు. ప్లంబింగ్ లేదా ఎలక్ట్రికల్ సిస్టమ్‌లను ఆధునీకరించొచ్చు. భవిష్యత్తులో ఇంటిని అమ్మాలనుకుంటే.. ఈ రెనోవేషన్ వల్ల ఇంటి ఆకర్షణ పెరిగి, విలువ పెరుగుతుంది.
జాగ్రత్తలు:ఇంటి పునరుద్ధరణ రుణాన్ని ఎంచుకునే సమయంలో వడ్డీ రేట్లు, రీపేమెంట్ నిబంధనలు, రుణంతో ముడిపడి ఉన్న రుసుములతో సహా రుణానికి సంబంధించిన నిబంధనలు, షరతులను పరిశీలించాలి. కొత్త ఇంటిని నిర్మించేటప్పుడు ఎంత అవుతుంది అనేది స్పష్టంగా తెలిసినా, ఇంటి పునరుద్ధరణ విషయంలో ఖర్చులు అర్థంకాకుండా ఉంటాయి. కాబట్టి, ఇంటి యజమానులు పునరుద్ధరణ ప్రాజెక్ట్‌కు సంబంధించి మొత్తం వ్యయం, ఎంత డబ్బు అవసరమో అవగాహన కలిగి ఉండాలి.
రుణ ఎంపిక:ఇంటి పునరుద్ధరణ కోసం.. వ్యక్తిగత రుణాలు, పునరుద్ధరణ రుణం, టాప్ - అప్ రుణాలు వంటి ఆప్షన్లు ఉన్నాయి. వ్యక్తిగత రుణాలను ఎలాంటి అవసరానికైనా ఉపయోగించవచ్చు, కానీ వడ్డీ ఎక్కువ. ఇంటి పునరుద్ధరణ రుణం సాధారణంగా హోమ్ లోన్ తరహా వడ్డీ రేట్లలో అందుబాటులో ఉంటుంది.
ఎంత రుణం పొందవచ్చు..?:ఇంటి పునరుద్ధరణ కోసం 25 వేల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. రుణ సంస్థలు, పునరుద్ధరణ వ్యయంలో 70% - 90% వరకు అందిస్తాయి. బ్యాంకుకు సంబంధించిన నియమ నిబంధనలు, రుణ గ్రహీత క్రెడిట్ యోగ్యతను బట్టి రుణం అందుతుంది. రుణం అందచేసేటప్పుడు మొత్తం ఇంటి (ఆస్తి) విలువను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. రుణగ్రహీతలు లోన్ తీసుకునే ముందు వివిధ బ్యాంకుల నుంచి రుణ ఆఫర్లను సరిపోల్చుకోవాలి.
Credit Score Improvement Tips : క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలా?.. ఈ టిప్స్ పాటించండి!
క్రెడిట్ స్కోరు: లోన్స్కుక్రెడిట్ స్కోరు చాలా ముఖ్యం. 700 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులను బ్యాంకులు విశ్వసనీయ రుణగ్రహీతలుగా పరిగణిస్తాయి. కానీ, క్రెడిట్ స్కోరు 600, ఇంతకంటే తక్కువ ఉన్నవారు కూడా ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకుతో ఉన్న సంబంధాన్ని బట్టి రుణ ఆమోదం ఉంటుంది.