Health Insurance Conditions For Coverage : ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వర్తించని సందర్భాలను తెలుసుకోవాలి. సమగ్ర బీమా పాలసీని ఎంచుకున్నప్పుడూ, కొన్నిసార్లు కచ్చితమైన మినహాయింపులు, తగ్గింపులు ఉండే అవకాశం ఉంది. చికిత్స మొత్తంలో కొంత మొత్తాన్ని పాలసీదారుడు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా డబ్బుల్ని బీమా పాలసీ చెల్లిస్తుంది. లేదా చికిత్స ఖర్చు నిర్ణీత పరిమితికి మించినప్పుడు, ఆ పై మొత్తానికే పరిహారం ఇస్తుంది. ఉదాహరణకు మీ పాలసీలో రూ.5 వేల వరకూ పరిమితి ఉందనుకుందాం. మీ చికిత్స ఖర్చు రూ.20వేలు అయ్యింది. అప్పుడు రూ.5వేలు మీరు, రూ.15వేలు పాలసీ చెల్లిస్తుంది. అదే సమయంలో రూ.5వేల లోపు ఖర్చయినప్పుడు బీమా సంస్థ పరిహారం చెల్లించదు. ఇందులోనూ రెండు రకాలున్నాయి.
- కచ్చితంగా: బీమా సంస్థ కొంత పరిమితి తర్వాతే చికిత్స ఖర్చును భరిస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడే దీన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఆ పరిమితి వరకూ పాలసీదారుడే ఖర్చును భరించాలి. అది దాటినప్పుడే బీమా సంస్థ ఖర్చులను చెల్లిస్తుంది.
- స్వచ్ఛందంగా: ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గాలని కోరుకున్నప్పుడు పాలసీదారుడు స్వచ్ఛందంగా మినహాయింపు పరిమితిని ఎంచుకునే అవకాశం ఉంది. క్లెయింలో ఎంత భాగాన్ని పాలసీదారుడు భరించగలరో ముందే నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి, పాలసీ ప్రీమియాన్ని బీమా సంస్థ నిర్ణయిస్తుంది. ఇది పాలసీదారుల వయసును బట్టి మారుతుంది. మీ దగ్గర డబ్బు ఉంది.. ఇబ్బందేమీ లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ మినహాయింపును ఎంచుకోండి. స్వల్ప ప్రీమియం ఆదా కోసం దీన్ని తీసుకుంటే.. తర్వాత ఆర్థికంగా భారం అయ్యే అవకాశం ఉంది.
టాపప్ ప్లాన్ తీసుకున్నారా?
టాపప్ పాలసీలు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఒక పరిమితి వరకూ పాలసీదారుడు లేదా సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ చికిత్స ఖర్చును చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికంగా అయ్యే మొత్తానికే టాపప్ పాలసీ వర్తిస్తుంది.