తెలంగాణ

telangana

ETV Bharat / business

హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్ విలీనం.. దేశ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్దది!

HDFC twins merger: మోర్టగేజ్‌ రుణ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌... ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌ విలీనం కానున్నాయి. ఈ మేరకు తమ బోర్డు ఆమోదం లభించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ సోమవారం ప్రకటించింది.

HDFC twins merger
హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్ విలీనం.. దేశ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్దది!

By

Published : Apr 4, 2022, 1:33 PM IST

HDFC twins merger: దేశ కార్పొరేట్‌ చరిత్రలో మరో కీలక విలీనం ఖరారైంది. మోర్టగేజ్‌ రుణ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌... ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌ విలీనం కానున్నాయి. ఈ మేరకు తమ బోర్డు ఆమోదం లభించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ సోమవారం ప్రకటించింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థలయిన హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌లో విలీనం కానున్నాయి. దీనికి సెబీ, సీసీఐ, ఆర్‌బీఐ సహా ఇతర నియంత్రణా సంస్థల అనుమతి లభించాల్సి ఉంది.

ఈ విలీన ప్రక్రియ 2023-24 ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీకి 41 శాతం వాటా లభించనుంది. ప్రతి 25 హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ షేర్లకు 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌ షేర్లు లభించనున్నాయి. ఈ పరిణామం నేపథ్యంలో నేడు ఇరు సంస్థల షేర్లు భారీగా లాభపడ్డాయి. ఓ దశలో ఈ జంట షేర్లు 15 శాతం మేర లాభపడడం విశేషం. మరోవైపు ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ పరుగుకు కూడా ఈ రెండే కారణం కావడం గమనార్హం.

మార్కెట్‌ విలువపరంగా విలీనానంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మూడో అతిపెద్ద సంస్థగా అవతరించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌ 1 నాటికి ఇరు సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే విలీనానంతర హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.12.8 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ50లో వెయిటేజీపరంగా చూసినా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అతిపెద్ద స్టాక్‌గా నిలవనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్చి 31 నాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెయిటేజీ 8.4 శాతంగా.. హెచ్‌డీఎఫ్‌సీ వెయిటేజీ 5.66 శాతంగా ఉంది. ఈ లెక్కన ప్రస్తుతం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ఉన్న 11.9 శాతం వెయిటేజీని సైతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దాటేయనుందని అంచనా.

ABOUT THE AUTHOR

...view details