HDFC interest rates: గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది హెచ్డీఎఫ్సీ. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్(ఆర్పీఎల్ఆర్)ను 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు బుధవారం ప్రకటనలో వెల్లడించింది. జూన్ 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఒక్క బేసిస్ పాయింట్ అంటే 0.01శాతంగా లెక్కగడతారు.
ఈ పెంపుతో ఒక్కనెల వ్యవధిలో వడ్డీ రేట్లను హెచ్డీఎఫ్సీ మూడు సార్లు పెంచినట్లయింది. ఇప్పటికే మే 1న 5 బేసిస్ పాయింట్లు, మే 7న 35 బేసిస్ పాయింట్లు పెంచింది. వడ్డీరేట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ఆకస్మికంగా ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఈఎంఐలు కట్టేవారిపై అదనపు భారం పడింది.
ఇతర బిజినెస్ వార్తలు.. సంక్షిప్తంగా...
మేలో రూ.1.41లక్షల కోట్లు: మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.41లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనలో తెలిపింది. గతేడాది మే నెలతో పోల్చితే ఇది 44శాతం అధికం. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో వచ్చిన రూ.1.68లక్షల కోట్లతో పోల్చితే మాత్రం ఇది తక్కువే. ఈ ఏడాది మార్చి నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు రూ.1.42లక్షల కోట్లుగా ఉన్నాయి.
తగ్గిన నిత్యావసరాల కొనుగోళ్లు..: జనవరి-మార్చి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ 5.3శాతం క్షీణించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఆహారపు, నిత్యావసరాల వస్తువుల ధరలు పెరగడం వల్ల కొనుగోళ్లు తగ్గినట్లు పేర్కొంది. గత మూడు త్రైమాసికాలలో ఇదే అత్యధిక క్షీణత అని నీల్సన్ఐక్యూ రిటైల్ ఇంటెలిజెన్స్ బృందం తెలిపింది. మరోవైపు తయారీ ఖర్చులు భారీగా పెరగడం వల్ల మూత పడ్డ చిన్న చిన్న తయారీ సంస్థల సంఖ్య మరింత పెరిగినట్లు నివేదిక చెప్పింది.
పెరిగిన వాహన విక్రయాలు:మే నెలలో 1,61,413 యూనిట్లు విక్రయించినట్లు దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ బుధవారం వెల్లడించింది. గతేడాది ఈ సంఖ్య కేవలం 46,555 యూనిట్లుగానే ఉంది. అయితే అప్పుడు కరోనా ప్రభావం ఆటోమొబైల్ రంగం తీవ్రంగా ప్రభావితమై కొనుగోళ్లు భారీగా పడిపోయాయి.
- మే నెలలో 76,210 యూనిట్లను విక్రయించినట్లు టాటా మోటార్స్ తెలిపింది. గతేడాడి ఇదే నెలలో విక్రయించిన 24,552 యూనిట్లతో పోల్చితే ఇది మూడు రెట్లు అధికమని పేర్కొంది.
- మేలో 18,718 యూనిట్లను విక్రయించినట్లు కియా ఇండియా ప్రకటనలో తెలిపింది. గతేడాది ఇదే నెలతో పోల్చితే ఇది 69శాతం అధికమని చెప్పింది.
- టొయోటా కిర్లోస్కార్ విక్రయాలు మేలో 10,216 యూనిట్లకు పెరిగినట్ల సంస్థ ప్రకటనలో తెలిపింది. గతేడాది ఇదే నెలతో పోల్చితే ఇది 14రెట్లు అధికం కావడం గమనార్హం.
- మే నెలలో 3,02,982 యూనిట్లను విక్రయించిననట్లు టీవీఎస్ మోటార్ సంస్థ వెల్లడించింది. ఇందులో 2,87,058 యూనిట్లు ద్విచక్రవాహనాలేనని పేర్కొంది. అయితే గతేడాది ఇదే సమయంలో విక్రయాలు 1,66,889 యూనిట్లకే పరిమితమయ్యాయు. అప్పుడు కరోనా ప్రభావం వల్ల ద్విచక్ర వాహనాల కోనుగోళ్లు కూడా తగ్గాయి.
- బజాజ్ ఆటో మేలో 2,75,868 యూనిట్లను విక్రయించింది. గతేడాది మేలో జరిగిన విక్రయాలు 2,71,862తో పోల్చితే ఇది స్వల్ప వృద్ధే.
ఇదీ చదవండి:జూన్లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!