Financial Security Tips :బాగా డబ్బు సంపాదించాలని ప్రతి సామాన్యుడు భావిస్తాడు. అందుకోసం వివిధ ప్రణాళికలు వేసుకుంటాడు. వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలి? మిగిలిన సొమ్మును ఎలా మదుపు చేయాలి? తదితర విషయాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు. అందుకోసం అనేక మార్గాలను అన్వేషిస్తుంటాడు. అవన్నీ ఏ మేరకు ఫలిస్తాయి? ఎంత మంది ధనవంతులుగా మారుతున్నారు? తదితర విషయాలు పక్కన పెడితే.. జీవితంలో ఉన్నతస్థాయికి చేరాలని ఆశించే ప్రతి ఒక్కరూ.. ఈ ప్రయాణంలో ఎంత కొంత పురోగతి సాధిస్తారు.
తాజాగా మిలియనీర్, ప్రముఖ రచయిత డేవిడ్ బాష్ అలాంటి వారి కోసం ఓ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. ధనవంతులుగా మారాలనుకుంటున్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. తన ఆదాయంలో ప్రతి వ్యక్తి కనీసం 14 శాతం పక్కకు తీయాలని డేవిడ్ బాష్ సూచిస్తున్నారు. మనిషి తన మొత్తం జీవితంలో సగటున 9,000 గంటలు పనిచేస్తారని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 14 శాతం అంటే.. రోజుకి ఒక గంట ఆదాయాన్ని పక్కన పెట్టాలని చెబుతున్నారు. అలా మనం చేస్తున్న సమయంలో మొదటి గంట ఆదాయాన్ని మనకు మనమే చెల్లించుకోవాలని డేవిడ్ బాష్ అంటున్నారు.
ఒక వ్యక్తి సంపాదించే ఆదాయం.. పన్నులు, అద్దెలు, లోన్ల చెల్లింపులు, ఆరోగ్యం, ఆహారం, క్రెడిట్ కార్డు, రవాణా.. ఇలా అనేక అవసరాలకు వెళ్లిపోతుంది. ఈ ఖర్చుల తర్వాత పొదుపు చేసేందుకు ఒక్క రూపాయి కూడా చేతిలో ఉండదు. అందుకే ప్రతిరోజు.. ఒక గంట ఆదాయాన్ని ముందుగానే మీకు మీరే చెల్లించుకోవాలి. ఉదాహరణకు మీ పని ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందనుకుంటే! ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య వస్తున్న ఆదాయం మీకే అన్నమాట!