Facts About No Cost EMI : పండగ సీజన్ వచ్చేసింది.. ఇదే అదనుగా మార్కెట్లో అనేక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు తమ ఉత్పత్తులపై వినియోగదారులకు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగంగా ఆఫర్ చేసేదే నో-కాస్ట్ ఈఎంఐ లేదా జీరో-కాస్ట్ ఈఎంఐ. దీని ద్వారా పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, గృహోపకరణాలు సహా ఇతర వస్తువులను చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. చేతిలో డబ్బు లేకపోయినా సరే.. చాలామంది ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటుంటారు. అయితే నో-కాస్ట్ ఈఎంఐతో ఏవైనా కొనేముందు మీకు లాభం చేకూర్చే పలు ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వడ్డీ రద్దు అంటూ ఏమి ఉండదు!
వినియోగదారుడు నో-కాస్ట్ ఈఎంఐను ఎంచుకుంటే వస్తువు కొన్న వెంటనే దాని ధర మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి వడ్డీ భారం లేకుండా అసలు ధరను మాత్రమే వాయిదాల రూపంలో కట్టాల్సి ఉంటుంది. వాస్తవానికి సంస్థ ప్రతినిధులు చెప్పినట్లుగా వస్తువుపై వడ్డీ భారాన్ని విధించకపోవడం అంటూ ఏమీ ఉండదు. దీనిని తయారీదారులు లేదా విక్రేతలే భరిస్తారు. తిరిగి వారు ఆ మొత్తాన్ని(వడ్డీని) పెద్ద సంఖ్యలో ప్రొడక్ట్‌లను విక్రయించడం ద్వారా వచ్చిన లాభంలో భర్తీ చేసుకుంటారు. ఇదొక బిజినెస్ టెక్నిక్ లాంటిదే!
వస్తువు ధరలోనే వడ్డీ మొత్తం..
మార్కెట్లో రిటైలర్లు అనుసరించే మరో వ్యాపార వ్యూహం.. వస్తువు ధరలోనే వడ్డీ రేట్. కొన్ని సందర్భాల్లో వడ్డీ భారాన్ని ప్రొడక్ట్ ధరలోనే కలిపేసి ఆ మొత్తాన్ని ఈఎంఐగా మారుస్తారు. కొన్నిసార్లు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్న వినియోగదారులకు ఇతర ప్రయోజనాలను కూడా రద్దు చేస్తారు. డిస్కౌంట్లు, ఆఫర్లు ఇలా సంస్థ నుంచి కస్టమర్‌కు లభించే పలు బెనిఫిట్స్‌ను రద్దు చేస్తారు. అనంతరం ప్రొడక్ట్ వాస్తవ ధరను ఈఎంఐ కిందకు మారుస్తారు.
ఉదాహరణకు.. ఈఎంఐ ఆప్షన్ కింద మీరు రూ.లక్ష పెట్టి ఒక ఐఫోన్‌ను కొనుగోలు చేశారనుకుందాం. దీనిపై వడ్డీ రేటు 12 శాతం. ఆరు నెలల్లో వాయిదాలు చెల్లించాలి. మొత్తం రూ.6,000 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పైన తెలిపినట్లుగా మొదటి సందర్భంలో అయితే, ఈ భారాన్ని తయారీదారులు, విక్రేతలే భరిస్తారు. పెద్ద సంఖ్యలో వస్తువులను అమ్మడం వల్ల వచ్చిన లాభంతో వీటిని సర్దుబాటు చేసుకుంటారు.
రెండో సందర్భంలో అయితే ఒకేసారి ఐఫోన్ ధరను చెల్లించడం వల్ల కస్టమర్‌కు వచ్చే రాయితీలు, ఆఫర్లు సహా ఇతర ప్రయోజనాలను తీసేస్తారు. ఉదాహరణకు మీరు ఏకమొత్తంలో డబ్బు చెల్లించడం ద్వారా మీకు రూ.10 వేల డిస్కౌంట్ వచ్చిందనుకుందాం. అలాగే ఫోన్‌పై ఇయర్‌బడ్స్, ఛార్జర్ వంటి వస్తువులను కంపెనీయే పూర్తి ఉచితంగా ఇస్తుందనుకుందాం. అయితే మీరు నో-కాస్ట్ ఈఎంఐను ఎంచుకోవడం వల్ల ఇవేవీ మీ వరకు చేరవు. అంటే రీటైలర్లు మీకు వీటిని ఇవ్వరు. వాస్తవ ధర అయిన రూ.1 లక్షను వాయిదాల కిందకు మారుస్తారు.
మూడో సందర్భంలో రూ.6,000 వడ్డీని కూడా కలిపి ఐఫోన్ ధరను రూ.1.06 లక్షలుగా పేర్కొంటారు. ఆ మొత్తాన్నే ప్రతినెలా ఈఎంఐల కిందకు మారుస్తారు.
క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కంటే ఇదే బెటర్?
కొన్నిసార్లు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే ఆర్థిక సామర్థ్యం మీ దగ్గర లేనప్పుడు మాత్రమే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌కు వెళ్లడం ఉత్తమమని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసి.. ఆ మొత్తాన్ని వాయిదాల కిందకు మార్చుకోవడం కంటే నో-కాస్ట్ ఈఎంఐను ఎంపిక చేసుకోవడం మేలు. క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై 20 నుంచి 25 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
నో-కాస్ట్ ఈఎంఐకు వెళ్లే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి..
- కొన్ని నో-కాస్ట్ ఈఎంఐలు తక్కువ కాలపరిమితిని కలిగి ఉంటాయి. దీంతో వాయిదా మొత్తం పెద్దమొత్తంలో కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా వాయిదా చెల్లించలేకపోతే మాత్రం మీ సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాకుండా జరిమానాలు చెల్లించే పరిస్థితి ఏర్పుడుతుంది. అందుకే నో-కాస్ట్ ఈఎంఐను ఎంచుకోవడానికి ముందే ఎన్ని ఇన్స్టాల్మెంట్లు, ఎంత మొత్తం చెల్లించాలి అనే విషయాలపై అవగాహన ఉంటే మంచిది.
- నో-కాస్ట్ ఈఎంఐలో మీకు నచ్చిన వస్తువులు దొరుకుతున్నాయి కదా అని ఇష్టారీతిన కొనుగోళ్లు చేస్తే మీరు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. పైగా క్రెడిట్ కార్డు జారీ చేసిన సంస్థ ఇచ్చే లిమిట్‌ను అధిగమించడం ద్వారా మీ సిబిల్ స్కోరుపై ప్రభావం పడే అవకాశం ఉంది.
- నో-కాస్ట్ ఈఎంఐను కొన్ని కంపెనీలు మాత్రమే ఆఫర్ చేస్తుంటాయి. అది కూడా ఎంపిక చేసిన కొన్ని రకాల వస్తువులపై మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రత్యేక బ్రాండ్‌లో ప్రత్యేక వస్తువును నో-కాస్ట్ ఈఎంఐలో కొనుగోలు చేద్దామని ముందే నిర్ణయం తీసుకోవద్దు.
- కంపెనీలు ఒక్కోసారి ప్రాసెసింగ్ ఫీజు, సర్వీసెస్ వంటి ఇతర ఛార్జీల రూపంలో కూడా వడ్డీని వసూలు చేస్తుంటాయి. వీటి గురించి కూడా అడిగి తెలుసుకోండి.
- మీరు కొనుగోలు చేయలనుకుంటున్న వస్తువు మీకు అందుబాటులో ఉన్న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్ల స్టోర్లలో ఏయే ధరకు అందుబాటులో ఉందో తెలుసుకోండి. అప్పుడే వడ్డీ భారాన్ని వస్తువు అసలు ధరలో కలిపారో లేదో స్పష్టంగా తెలుస్తుంది.
- నో-కాస్ట్ ఈఎంఐ ఎంచుకోవడం వల్ల వర్తించే నియమ నిబంధనలన్నింటినీ ముందే అర్థం చేసుకోవాలి. వాయిదా మొత్తం, ఎన్ని నెలలు, ఫీజులు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు వంటి వివరాలను తెలుసుకోవాలి.
- కొన్ని సందర్భాల్లో నో-కాస్ట్ ఈఎంఐను ఎంచుకున్నప్పటికీ.. ఎంతో కొంత డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈఎంఐ తేదీని అస్సలు మర్చిపోవద్దు.
Dormant Demat Account : మీ డీమ్యాట్ అకౌంట్.. 'ఇన్‌యాక్టివ్'గా మారిందా?.. అయితే ఈ ఆర్థిక ఇబ్బందులు తప్పవు!
How To Get Rental Income Without Buying Property : ప్రాపర్టీ కొనకుండానే ప్రతినెలా అద్దె!.. అయితే ఇలా చేయండి..