EPF Advance Withdrawal : ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) గురించి అందరికీ తెలిసిందే. జీతం పొందే ఉద్యోగులకు అందించే పదవీ విరమణ కార్యక్రమంగా దీన్ని చెప్పొచ్చు. ఈ పథకంలో ఉద్యోగుల నెలవారీ జీతంలో కొంత భాగాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో జమ చేస్తారు. ఉద్యోగితో పాటు వాళ్లు పనిచేసే కంపెనీ కూడా ఈ నిధిలో నిర్ణీత మొత్తాన్ని జమ చేస్తుంది. పీఎఫ్ అనేది కాలానుగుణంగా పెరుగుతూ పోతుంది. ఈ ఖాతా ఉన్నవారు వేర్వేరు కారణాలతో ఈపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతాదారులు వెల్లడించే కారణాలను అనుసరించి ఉపసంహరించుకునే పీఎఫ్ శాతం మారుతుంది. అయితే ఈపీఎఫ్ అడ్వాన్స్ విత్‌డ్రాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గృహ రుణం లేదా గృహ నిర్మాణ ఖర్చులు
EPF advance withdrawal for house purchase :ఇల్లు కొనుక్కోవాలని అనుకునేవారికి లేదా నూతనంగా గృహాన్ని నిర్మించుకునే ఖాతాదారులకు ఈపీఎఫ్ అండగా నిలుస్తోంది. వారికి కావాల్సిన రుణాన్ని లేదా నిర్మాణ ఖర్చులను అందించేందుకు ముందుకు వస్తోంది. అయితే దీనికి ఓ రూల్ ఉంది. 5 సంవత్సరాల సభ్యత్వాన్ని పూర్తి చేసుకున్న ఖాతాదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఐదేళ్లకు పైగా సభ్యత్వాన్ని కలిగిన ఖాతాదారులకు ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చులు లేదా ఇల్లు కొనుగోలుకు రుణాలను అందిస్తామని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. ఇంటికి సంబంధించిన దస్తావేజులు ఖాతాదారాలు లేదా వారి జీవిత భాగస్వామి పేరుపై ఉన్నప్పుడే లోన్ మంజూరు అవుతుందని తెలిపింది. ఇంటి స్థలం కొనుగోలు చేయాలనుకునే ఉద్యోగులకు వారి నెలవారీ జీతానికి 24 రెట్లు అధికంగా రుణం లభిస్తుంది. ఇంటి నిర్మాణానికి లేదా గృహం కొనుగోలుకు అయితే ఉద్యోగి వేతనానికి 36 రెట్లు మొత్తాన్ని లోన్‌గా ఇస్తుంది.
వైద్య చికిత్స
EPF advance withdrawal for medical treatment : వైద్య ఖర్చుల కోసం ఈపీఎఫ్ ఖాతా నుంచి ఎప్పుడైనా డబ్బులను ఉపసంహరించుకోవచ్చు. ఉద్యోగి జీతానికి ఆరు రెట్లు డబ్బు లేదా వేతనంపై వస్తున్న వడ్డీ రేటులో ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని వైద్య చికిత్స కోసం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతాదారుడితో పాటు వారి తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా పిల్లల వైద్య చికిత్స కోసం కూడా ఈపీఎఫ్ నుంచి అవసరమైనప్పుడు డబ్బులను తీసుకోవచ్చు.