తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్విట్టర్ డీల్ పూర్తి.. ఆ ఖాతాలపై నిషేధం తొలగింపు కష్టమే! - ట్విట్టర్ డీల్ ఎలాన్ మస్క్ న్యూస్

ట్విటర్‌ డీల్​పై చాలా కాలంగా ఉన్న అనిశ్చితి తొలగిపోయింది. దిగ్గజ సామాజిక మాధ్యమం.. ఎలాన్ మస్క్ చేతికి చేరింది. వచ్చీరాగానే కీలక ఉద్యోగులపై వేటు వేశారు మస్క్. అయితే, నిషేధానికి గురైన ఖాతాలపై సమీక్ష జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని మస్క్ స్పష్టం చేశారు.

Elon Musk officially takes over Twitter
Elon Musk officially takes over Twitter

By

Published : Oct 29, 2022, 6:51 AM IST

ప్రపంచ కుబేరుల్లో అగ్రగణ్యుడు, విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ (51) గూటిలోకి ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ చేరింది. 44 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3.65 లక్షల కోట్ల)తో ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న అనంతరం.. 'ఇక అంతా మంచే జరగాలి..ట్విటర్‌ పక్షికి స్వేచ్ఛ లభించింది' అని మస్క్‌ ట్వీట్‌ చేశారు. తన ఆధీనంలోకి వచ్చిన గంటల వ్యవధిలోనే ట్విటర్‌ నుంచి నలుగురు ఉన్నతోద్యోగులకు ఉద్వాసన పలికారు. వీరిలో ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) పరాగ్‌ అగర్వాల్‌, లీగల్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ గద్దె భారతీయులు. చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ నెడ్‌ సెగల్‌, జనరల్‌ కౌన్సెల్‌ సీన్‌ ఎడ్జెట్‌లనూ ఆయన తొలగించారని తెలుస్తోంది. వీరిలో ఒకరినైతే మరీ అవమానకర రీతిలో.. కార్యాలయం బయటకు పంపేందుకు భద్రత సిబ్బందిని వినియోగించినట్లు న్యూయార్క్‌టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. ట్విటర్‌తో ఏప్రిల్‌లో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటానని మస్క్‌ జూన్‌లో బెదిరించగా, దీనిపై ట్విటర్‌ కోర్టును జులైలో ఆశ్రయించింది. ఈ మొత్తం పరిణామాల్లోనూ వీరి పాత్ర ఉందన్న భావనతోనే మస్క్‌, తొలిరోజునే ఇలాంటి చర్య తీసుకున్నారని చెబుతున్నారు.

ఏడాది అనిశ్చితికి తెర
ట్విటర్‌ వ్యాపారంపై ఉద్యోగులు, వాటాదార్లలో ఏడాది కాలంగా ఉన్న అనిశ్చితి తొలగిందని వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌ వ్యాఖ్యానించింది. ఏప్రిల్‌లో కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన మస్క్‌.. స్పామ్‌ బాట్స్‌ సంఖ్య విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒప్పందం నుంచి వైదొలగాలని చూశారు. అయితే ట్విటర్‌ కోర్టును ఆశ్రయించడంతో, మళ్లీ మనసు మార్చుకున్నారు. కోర్టు గడువు (అక్టోబరు 28)కు ఒక రోజు ముందే కొనుగోలు పూర్తి చేశారు.

'ఇక ఎవరైనా ఏమైనా చెప్పొచ్చు. తదనంతర పరిణామాలేమీ ఉండవు. ట్విటర్‌ను నేను కొనుగోలు చేయడానికి కారణం.. ఆరోగ్యకర రీతిలో, ఎటువంటి హింసకు తావు ఇవ్వకుండా, తమ విస్తృత విశ్వాసాలపై చర్చించుకునేందుకు అందరికీ ఒక డిజిటల్‌ ప్లాట్‌ఫాం వీలుగా ఉండాలనే. ప్రస్తుతం సామాజిక మాధ్యమం గొప్ప ప్రమాదంలో ఉంది. ద్వేషాన్ని వెదజల్లుతూ, మన సమాజాన్ని విడగొట్టేలా తయారవుతోంది. ఈ పరిస్థితిని మారుద్దాం'
- ఎలాన్‌ మస్క్‌

కొన్ని ముఖ్యాంశాలు

  • ట్విటర్‌ను స్థాపించింది 2006
  • ప్రతినెలా వినియోగిస్తున్న వారి సంఖ్య 39.65 కోట్లు
  • రోజూ ట్వీట్‌ చేసే వారి సంఖ్య 19.20 కోట్లు
  • టెక్‌ కంపెనీల్లో 3వ అతిపెద్ద కొనుగోలు
  • 1. గేమింగ్‌ కంపెనీ బ్లిజార్డ్‌ను 2022 జనవరిలో మైక్రోసాఫ్ట్‌ 68.7 బి.డా.కు
  • 2. నెట్‌వర్క్‌ స్టోరేజీ సంస్థ ఈఎంసీని 2015లో డెల్‌ 67 బి.డా.కు
  • 3. ట్విటర్‌ను 2022 అక్టోబరులో ఎలాన్‌ మస్క్‌ 44 బి.డా.కు కొనుగోలు చేశారు

అగర్వాల్‌పై ఎందుకు వేటు?
గతేడాది నవంబరులో ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే వైదొలగడంతో, సంస్థ సీఈఓగా పరాగ్‌ అగర్వాల్‌ (38) పగ్గాలు చేపట్టారు. 2011లో చేరిన పరాగ్‌.. 2017 కల్లా చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ స్థాయికి చేరారు. సంస్థ టేకోవర్‌ విషయంలో మస్క్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇటీవలి కాలంలో గొడవపడిన కారణంగానే పరాగ్‌ ఉద్వాసనకు గురి కావాల్సి వచ్చిందని న్యూయార్క్‌ టైమ్స్‌ అభిప్రాయపడింది. అయితే అగర్వాల్‌ను తొలగించిన పక్షంలో ఆయనకు 60 మిలియన్‌ డాలర్ల పరిహారాన్ని ఇవ్వాల్సి ఉంటుందని 2022 మేలో ప్రచురించిన ఒక కథనంలో ఈ పత్రిక పేర్కొంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు నేతృత్వం వహిస్తున్న సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌, శంతను నారాయణ్‌, ఇంద్రా నూయి వంటి భారతీయుల జాబితాలో చేరిన పరాగ్‌.. ఇంత త్వరగా ఉన్నత పదవి నుంచి ఉద్వాసనకు గురికావడం గమనార్హం. ట్విటర్‌ సీఈఓగా పరాగ్‌ స్థానంలో మస్క్‌ బాధ్యతలు చేపడతారని సమాచారం. తెలివైన వ్యక్తి చేతుల్లోకి ట్విటర్‌ చేరిందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసించారు.

హైదరాబాద్‌కు చెందిన విజయ గద్దెపైనా..?
యూఎస్‌ క్యాపిటల్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మద్దతుదార్లు చేసిన దాడుల అనంతరం.. ట్రంప్‌ను ట్విటర్‌ నుంచి శాశ్వతంగా నిషేధించడంలో కీలక పాత్ర పోషించిన, హైదరాబాద్‌కు చెందిన విజయ గద్దెనూ మస్క్‌ బయటకు పంపించారు. ఉద్రిక్తతలకు కారణమయ్యే కంటెంట్‌ విషయంలో ఈమె కఠినంగా వ్యవహరించారని వార్తలొచ్చాయి. ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు బిజ్‌స్టోన్‌ మాత్రం 'ట్విటర్‌ వ్యాపార వృద్ధికి భారీ స్థాయిలో కృషి చేసిన పరాగ్‌, విజయ, నెడ్‌సెగల్‌లకు కృతజ్ఞతల'ని ట్వీట్‌ చేశారు.

షేర్ల ట్రేడింగ్‌ రద్దు
న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. ట్విటర్‌ షేర్ల ట్రేడింగ్‌ను శుక్రవారం నుంచి రద్దు చేయనున్నారు. ఇందుకు కారణం 'విలీనం అమల్లోకి' రావడమేనని అందులో తెలిపింది. మరో వైపు కొత్త యాజమాన్య బృందంపై ట్విటర్‌ ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు.

భారత్‌లో మిశ్రమ స్పందనలు
ట్విటర్‌ను మస్క్‌ టేకోవర్‌ చేయడంపై భారత్‌లోని పలువురు ప్రముఖుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అశోక్‌ పండిట్‌, వివేక్‌ అగ్నిహోత్రి వంటి సినీ ప్రముఖులు, నటి కంగనా రౌనత్‌ స్వాగతించారు. ట్విటర్‌ ఇండియా ఇకపై పక్షపాతం లేని ప్లాట్‌ఫాంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ నేత సంజయ్‌ ఝా, కాలమిస్ట్‌ స్వాతి చతుర్వేది వంటి వారు మాత్రం 'మస్క్‌ కూడా డొనాల్ట్‌ ట్రంప్‌ వంటివారేనని.. జాగ్రత్తగా ఉండాల్సిన పరిణామం ఇద'ని అన్నారు. 'ట్విటర్‌కు ఎవరు యజమాని అయినా.. మన చట్టాలు, నిబంధనలు మారవు' అంటూ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖరన్‌ స్పష్టం చేశారు.

ఆ ఖాతాలపై నిర్ణయం ఇప్పుడే కాదు
మస్క్ గూటికి ట్విట్టర్ చేరగానే.. ఇదివరకు నిషేధానికి గురైన ఖాతాలను పునరుద్ధరిస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఎలాన్ మస్క్.. ప్రస్తుతానికి నిషేధిత ఖాతాలను పునరుద్ధరించడం లేదని స్పష్టం చేశారు. ఈ విధానంపై నూతనంగా ఏర్పాటు చేసే 'కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్' సమీక్ష చేపట్టిన తర్వాతే రద్దైన ఖాతాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

అప్పిలేట్ ప్యానళ్ల ఏర్పాటు..
సామాజిక మాధ్యమాల్లో కంటెంట్‌, ఇతర అంశాలకు సంబంధించి వినియోగదారుల సమస్యల పరిష్కారానికి అప్పిలేట్‌ ప్యానళ్లను భారత ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 3 నెలల్లోగా వీటిని ఏర్పాటు చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details