Elon Musk Twitter: ట్విట్టర్ యజమానిగా మారిన వెంటనే సంస్థలో దాదాపు 75 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రణాళికలు వేసుకున్నారని సమాచారం. ఈ విషయాన్ని ట్విట్టర్ కొనుగోలుకు కావాల్సిన నిధుల్ని సమీకరించే సమయంలో పెట్టుబడిదారులతో చెప్పారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఫలితంగా కంపెనీ ఆర్థిక పనితీరు మెరుగుపడుతుందని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపింది.
ప్రస్తుతం ట్విట్టర్లో 7,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 75 శాతం మందిని తొలగిస్తే కేవలం కీలక వ్యక్తులు మాత్రమే మిగిలిపోతారు. వాస్తవానికి ట్విట్టర్ ప్రస్తుత యాజమాన్యం సైతం ఉద్యోగుల్ని తగ్గించుకునే యోచనలో ఉంది. ఇప్పటికే కొత్త నియామకాల్ని వాయిదా వేసింది. అయితే, ఇంత భారీ ఎత్తున కోత ఉంటుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. కొనుగోలు ఒప్పందం ఖరారైన సమయంలోనూ మస్క్ ఉద్యోగాల కోతపై మాట్లాడారు. కానీ, ఎంత మొత్తం అని మాత్రం ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు.
ఈ కథనాలపై ట్విట్టర్ స్పందించింది. ప్రస్తుతానికి ఎలాంటి తొలగింపు ఉండబోదని ఉద్యోగులకు హామీ ఇచ్చింది. కొనుగోలుదారుల నుంచి సైతం అలాంటి ప్రతిపాదనలేమీ రాలేదని పేర్కొంది. అయితే, కొనుగోలు ఒప్పందం అమలు కావడానికి ముందు ఇలాంటి ఊహాగానాలను మరిన్ని వినేందుకు సిద్ధంగా ఉండాలని సిబ్బందిని అప్రమత్తం చేసింది.