ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్...సంస్థాగతంగా సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ట్విట్టర్ నుంచి సగం మంది ఉద్యోగుల్ని తొలగించే యోచనలో మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది. ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగా దాదాపు 3 వేల 700 మంది సిబ్బందిని కంపెనీ నుంచి పంపించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రచురించింది.
రేపటి కల్లా తొలగించే వారి జాబితాను ప్రకటించవచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఉద్యోగుల సంఖ్యలో కోత సహా ఇతర మార్పులపై మస్క్ తన సలహాదారులతో విస్తృతంగా చర్చిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ఉద్వాసనకు గురయ్యే వారికి అందించాల్సిన పరిహారంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 60 రోజుల వేతనం ఇచ్చి వారిని పంపించాలనుకుంటున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ప్రస్తుతం ట్విటర్ అమలు చేస్తున్న ఎక్కడి నుంచైనా పనిచేసుకునే విధానాన్ని కూడా మస్క్ ఉసహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని మినహాయింపులను పక్కన పెట్టి మిగిలినవారంతా కంపెనీకి వచ్చి పనిచేయాలని త్వరలోనే ఆదేశాలు జారీ చేయవచ్చని సమాచారం. మరోవైపు ట్విటర్‌లో బ్లూ టిక్ సహా ఇతర ప్రయోజనాలకు 8 డాలర్లు చెల్లించాలన్న నిర్ణయంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మస్క్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని ట్విటర్ వేదికగా పలువురికి గట్టిగా బదులిచ్చారు. చెల్లించిన మొత్తానికి కచ్చితంగా ప్రతిఫలం దక్కుతుందని తెలిపారు. మరోవైపు వచ్చే వారం నుంచే ఈ కొత్త ఛార్జీని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కంపెనీలోని ఉన్నత వర్గాలు చెప్పాయి.
మస్క్ ఎఫెక్ట్.. ఆఫీసులోనే నిద్రపోయిన ట్విట్టర్ ఉద్యోగి
ట్విట్టర్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను రోజుకు 12 గంటలు పనిచేయాలని మస్క్ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. లేదంటే విధుల నుంచి తొలగిస్తామని ఆయన హెచ్చరికలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్లో ఓ ఫొటో వైరల్‌గా మారింది.
ఆ ఫొటోలో ట్విట్టర్లో పని చేస్తున్న ఓ మేనేజర్ ఆఫీసులో పని చేసి.. ఇంటికి వెళ్లే సమయం లేక అక్కడే నిద్రపోయింది. స్లీపింగ్ బ్యాగ్‌లో దూరి.. ఆఫీసులో టేబుల్, చైర్ల వెనుక ఆమె పడుకుంది. దీనిని మరో ఉద్యోగి షేర్ చేయడం గమనార్హం. దీంతో ఒక్కసారిగా ఈ ఫొటో వైరల్‌గా మారింది. 'ఇంటికి వెళ్లే సమయం కూడా లేకపోతే మరేం చేస్తారు.. ఇలానే ఉంటుంది' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఆఫీస్‌లోనే నిద్రపోయిన ఉద్యోగి ఇవీ చదవండి:వాట్సాప్‌లో యూజర్లకు గుడ్ న్యూస్.. సెల్ఫ్ మెసేజ్‌తో సహా 5 కొత్త ఫీచర్స్!
గూగుల్ గుడ్ న్యూస్.. క్లౌడ్ స్టోరేజీ 15GB నుంచి 1TBకి పెంపు.. కానీ వారికి మాత్రమే!