ప్రభుత్వం వరుసగా రెండో త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల పై వడ్డీ రేట్లను పెంచింది. ఇవి 20 నుంచి 110 బేసిస్ పాయింట్ల మధ్య పెరిగి 4.0 శాతం నుంచి 7.6 శాతం వరకు చేరుకున్నాయి. 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే లక్ష్యంతో మే 2022 నుంచి రెపో రేటును 225 బీపీఎస్ పెంచిన నేపథ్యంలో డిపాజిట్ రేట్లు సైతం పెరుగుతున్నాయి. చిన్న పొదుపు పథకాల రేట్లు ముందుగా నిర్వచించిన సూత్రం ఆధారంగా మార్కెట్‌కు అనుసంధానమై ఉంటాయి. సెప్టెంబరులో విడుదల చేసిన చివరి ద్రవ్య విధాన నివేదిక ప్రకారం ఈ రేట్లు సూత్రం ఆధారిత రేట్ల కంటే 44- 77 bps తక్కువగా ఉన్నాయి. అందువల్లే డిపాజిట్ రేట్ల పెంపు అనివార్యమైంది.
వీటిలోనే గరిష్ఠ పెంపు..
డిపాజిట్ రేట్లు అత్యధికంగా ఒక ఏడాది, రెండు సంత్సరాలు, మూడేళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరిగాయి. అంతకంటే తక్కువ గడువు గల డిపాజిట్లు రేపో రేటుపై ఆధారపడి ఉంటాయి. అలాగే మూడేళ్ల కంటే ఎక్కువ కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీరేటు ప్రభుత్వ సెక్యూరిటీల వంటి మార్కెట్ సాధనాలపై ఆధారపడి ఉంటుంది. రెపోరేటు 225 బీపీఎస్ పెరిగిన నేపథ్యంలో డిపాజిట్ రేట్ల పెరుగుదల అత్యధికంగా తక్కువ గడువు ఉన్న డిపాజిట్లపైనే ఉంటుంది.
ఎందులో రాబడి ఎక్కువ?
డిపాజిట్ రేట్లు పెరిగిన నేపథ్యంలో సురక్షిత మదుపు మార్గాల్లో ఏది ఆకర్షణీయమైన రాబడినిస్తోందనే ప్రశ్న తలెత్తుతోంది? 'సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్)'లో ప్రస్తుతం 8 శాతం వడ్డీరేటు లభిస్తోంది. మిగిలిన చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో దాదాపు అన్నింట్లో 7 శాతానికి కొంచెం అటుఇటుగా ఉంది. ద్రవ్యోల్బణం 6 శాతానికి దిగువకు చేరింది. సమీప భవిష్యత్తులో అనూహ్యంగా పెరిగే సూచనలు కూడా లేవని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో చిన్న పొదుపు పథకాలన్నీ ప్రస్తుతం ఆకర్షణీయమైన రాబడినే ఇస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, పన్నును పరిగణనలోకి తీసుకుంటే ఫలితం మారొచ్చు. కాబట్టి మదుపర్లు ఏ పన్ను శ్లాబులోకి వస్తారనేది కూడా ఇక్కడ ముఖ్యమైన అంశం. దిగువ పన్ను శ్లాబుల్లో ఉన్నవారికి ఎస్‌సీఎస్‌ఎస్ మెరుగైన రాబడినిస్తుందని నిపుణుల సూచన.