Credit card loan vs personal loan : క్రెడిట్ కార్డును కేవలం కొనుగోళ్లు చేయడానికి మాత్రమే కాదు.. అత్యవసర సమయాల్లో వెంటనే అప్పు ఇచ్చే సాధనంగానూ దాన్ని ఉపయోగించుకోవచ్చు. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే.. క్రెడిట్ కార్డుతో చేసే అప్పులు వేగంగా అందుతాయి. అందుకోసం ఎలాంటి డాక్యుమెంట్లు సైతం సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఇలా రుణం తీసుకునే సమయాల్లో కొన్ని విషయాలను పూర్తిగా అర్థం చేసుకున్నాకే ముందుకెళ్లడం మంచిది. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లను జరపవచ్చు. కొన్నిసార్లు అనుమతించిన పరిమితి లోపు ఏటీఎం నుంచి సొమ్మును విత్డ్రా చేసుకోవచ్చు. ఇవే కాకుండా క్రెడిట్ కార్డుపై పర్సనల్ లోన్ సైతం తీసుకోవచ్చు. వినియోగదారుడు క్రెడిట్ కార్డును వాడుతున్న తీరు, క్రెడిట్ స్కోరును బట్టి.. ఆయా కార్డు సంస్థలు ఈ అప్పును సమకూరుస్తాయి.
ముందుగానే..
Credit card loan interest rate : క్రెడిట్ కార్డు ఉన్న వారందరికీ ఈ రుణం అందే అవకాశం లేకపోవచ్చు. బ్యాంకులు, కార్డు సంస్థలు ఆయా కార్డులపై ఎంత మొత్తాన్ని అప్పుగా ఇస్తామనే విషయాన్ని ముందుగానే తెలియజేస్తాయి. అవసరం ఉన్నప్పుడు ఒక్క క్లిక్ చేస్తే చాలు.. అకౌంట్లో నగదు జమ అవుతుంది. ఇది ఎలాంటి హామీ లేని అప్పే. కార్డుతో నగదు తీసుకున్నప్పుడు బిల్లుతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. నగదు తీసుకున్న రోజు నుంచి ముప్పై ఆరు శాతం వరకు.. వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కార్డుతో అప్పు తీసుకున్నప్పుడు నిర్ణీత వ్యవధి ఉంటుంది. 16 నుంచి 18 శాతం వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా 36 నెలల పాటు రుణ వ్యవధిని ఎంపిక చేసుచుకోవచ్చు. కాబట్టి, దీర్ఘకాలిక వ్యవధితో రుణం తీసుకోవాలి అనుకున్నప్పుడు కార్డు రుణాన్ని ఎంచుకోవచ్చు.
పరిమితి తగ్గదు..
కార్డును ఉపయోగించి ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలనుకుంటే.. కార్డు పరిమితి ఆ మేరకు తగ్గుతుంది. అప్పు తీసుకున్నప్పుడు కార్డు పరిమితితో సంబంధం ఉండదు. దీంతో మీ కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.