ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా ఎంతో కీలకం. సమగ్రమైన పాలసీ ఉన్నప్పుడు అనారోగ్యంలోనూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా చూసుకోవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడు అందులో ఉండే నిబంధనలేమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా వేచి ఉండాల్సిన వ్యవధి (వెయిటింగ్ పీరియడ్) గురించి మర్చిపోవద్దు. ఆరోగ్య బీమా పాలసీని తీసుకున్న ఏ చికిత్సకైనా పరిహారం వస్తుందని చాలామంది భావిస్తుంటారు. ప్రమాదంలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇది వర్తిస్తుంది. నిర్ణీత వ్యాధుల విషయానికి వచ్చే సరికి నిబంధనలు మారిపోతుంటాయి. కొంతకాలం తర్వాతే ఆ వ్యాధుల చికిత్సకు పరిహారం లభిస్తుంది. పాలసీ ప్రారంభమైన వెంటనే ఈ వేచి ఉండే వ్యవధి అమల్లోకి వస్తుంది. ఈ వ్యవధులు వ్యాధులను బట్టి, మారుతూ ఉంటాయి.
ప్రారంభంలో: ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న వెంటనే ఆసుపత్రిలో చేరితే చికిత్స ఖర్చులను చెల్లించదు. ప్రారంభంలో కొంత నిరీక్షణా కాలం ఉంటుంది. దీన్ని కూలింగ్ ఆఫ్ పీరియడ్‌గా చెప్పుకోవచ్చు. పాలసీ ప్రయోజనాలు పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యేందుకు కనీసం 30 రోజులు ఆగాల్సిందే. ఈ వేచి ఉండే వ్యవధిలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు పరిహారం అందదు. ప్రమాదాలు జరిగినప్పుడు వేచి ఉండే వ్యవధి అనే నిబంధన వర్తించదు. పాలసీ తీసుకున్న క్షణం నుంచే దీనికి పరిహారం అందుతుంది.
ముందస్తు వ్యాధులు:పాలసీ తీసుకునే నాటికే ఉన్న కొన్ని వ్యాధులు ఉంటే వాటి చికిత్సకు అయ్యే ఖర్చును వెంటనే చెల్లించవు. వీటిని ముందస్తు వ్యాధులుగా బీమా సంస్థ పరిగణిస్తుంది. రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, ఉబ్బసంవంటి వ్యాధులు సాధారణంగా ఈ జాబితాలో ఉంటాయి. వీటి చికిత్స ఖర్చుల కోసం కనీసం 2-4 సంవత్సరాల వరకూ వేచి చూడాలి.