Bima Sugam IRDAI: చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు ఎంత ఖర్చవుతుందో చెప్పడం కష్టం. ఆరోగ్య బీమా లేకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కొవిడ్ పరిణామాలతో ఈ విషయాన్ని గ్రహించిన చాలామంది ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అధిక ప్రీమియం వల్ల కొందరు పాలసీ తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) పలు కీలక సంస్కరణలకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
బీమా సుగమ్‌తో..:వివిధ సంస్థలు అందిస్తున్న ఆరోగ్య బీమా పాలసీలను పోల్చి చూసుకుని, వాటిలో ఏది మెరుగైందో తేల్చుకోవడం అంత సులభమేమీ కాదు. కొన్ని బీమా అగ్రిగేటర్ వెబ్‌సైట్లు ఈ విషయంలో పాలసీదారులకు సమాచారం అందిస్తున్నా.. అదీ పూర్తి వ్యాపార ధోరణితోనే ఉంటోంది. అందుకే ఐఆర్‌డీఏఐ 'బీమా సుగమ్' పేరుతో ఒక ప్రత్యేక వేదికను తీసుకు రానున్నట్లు సంస్థ ఛైర్మన్ దేవాశీష్ పాండా ఇటీవల వెల్లడించారు.
అందరూ బీమా పొందేలా..:గత అయిదేళ్లలో 19 శాతం చొప్పున వృద్ధి చెందుతున్న ఆరోగ్య బీమా రంగం, దాదాపు రూ.60,000 కోట్ల స్థాయికి చేరింది. మున్ముందు ఇది 30-35 శాతం వృద్ధి చెందే అవకాశాలున్నాయని అంచనా. 2047 నాటికి దేశ ప్రజలందరూ ఆరోగ్య బీమా పరిధిలోకి రావాలనే ఆలోచనతో ఐఆర్‌డీఏఐ ఉంది. బీమాపై అవగాహన పెంచడం, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం, కొత్త ఆవిష్కరణలతోనే ఇది సాధ్యం అవుతుందన్నది నియంత్రణ సంస్థ భావన.