Best Stock Market Investment Tips :స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు రావడం చాలా సహజం. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా.. స్టాక్ మార్కెట్లపై వాటి ప్రభావం పడుతూనే ఉంటుంది. ఆ ప్రభావం పాజిటివ్‌గా ఉండొచ్చు లేదా నెగిటివ్‌గానూ ఉండవచ్చు. అయితే సాధారణ ఇన్వెస్టర్లు ఇలా ఒడుదొడుకులు ఉన్న సమయంలో మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి జంకుతూ ఉంటారు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇదే మంచి అవకాశమని నిపుణలు చెబుతున్నారు.
పెట్టుబడి సూత్రాలు!
Best Investment Tips : ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు కాస్త ఒడుదొడుకుల్లో ఉన్నాయని చెప్పకతప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ పెట్టుబడి మొత్తాన్ని జాగ్రత్త చేసుకోవడానికి అనుసరించాల్సిన సూత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆందోళన చెందకండి!
మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పుడు సహజంగానే మదుపరుల్లో భయాందోళనలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలోనే లేనిపోని వదంతులు, ఊహాగానాలు వినిపిస్తూ ఉంటాయి. వీటిని చూసి మీరు ఆందోళనకు గురికాకూడదు. ఆవేశంలో ఏలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకూడదు.
నకిలీ నిపుణులతో జాగ్రత్త!
Beware Of Fake Financial Advisors : ఆన్లైన్లో నేడు చాలా మంది నకిలీ ఆర్థిక నిపుణులు ఉన్నారు. వీరు లేనిపోని, అర్థంపర్థంలేని ఆర్థిక విశ్లేషణలు చేస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో తప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. ఇలాంటి వారి ట్రాప్‌లో మీరు పడకుండా జాగ్రత్త పడాలి. చాలా మంది టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చే ఆర్థిక విశ్లేషణలు చూసి ఆందోళనకు గురవుతారు. నష్టభయంతో తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల వారు తీవ్రంగా నష్టపోతారు. మార్కెట్లు తిరిగి కోలుకున్న సమయంలో.. వచ్చే లాభాలను కూడా వారు కోల్పోతారు.
వీటిని గుర్తించుకోవాలి!
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు లాంటివి మీ దగ్గరున్న నగదు విలువను భారీగా తగ్గిస్తాయి. అందుకే మన దగ్గర ఉన్న డబ్బును మంచి పెట్టుబడి మార్గాలో ఇన్వెస్ట్ చేయాలి. వాస్తవానికి డబ్బులు పెట్టుబడుల రూపంలో ఉన్నప్పుడే మంచి ఫలితాలు రాబట్టుకోగలం.
మార్కెట్‌ను ఎవరూ నియంత్రించలేరు!
స్టాక్ మార్కెట్‌పై పడే బాహ్య ప్రభావాలను ఎవరూ నియంత్రించలేరు అనేది వాస్తవం. అందుకని పెట్టుబడుల విలువ తగ్గిపోగానే ఆందోళన చెందడం సరికాదు. మీరు విన్న సమాచారం ఎంత మేరకు సరైనదో ముందుగా చెక్ చేసుకోవాలి. ఆ తరువాతే సరైన నిర్ణయం తీసుకోవాలి.
ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు!
పెట్టుబడులు ఎప్పుడూ మీ ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి. మీ లక్ష్యాన్ని సాధించే వరకూ మదుపు కొనసాగుతూనే ఉండాలి. అదే మధ్యలోనే వదిలేస్తే ఎటూకాని పరిస్థితుల్లోకి వెళ్లిపోతారు. మార్కెట్ చరిత్రను జాగ్రత్తగా పరిశీలిస్తే.. మార్కెట్లో ఎంత ఎక్కువ కాలం కొనసాగితే.. నష్టభయం అంత మేరకు తగ్గుతుంది. మంచి లాభాలు కూడా వస్తాయి. క్రమానుగుత పెట్టుబడి విధానం (సిప్) మార్గంలో మదుపు చేస్తూ వెళ్లడం ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల్లోనూ సగటు ప్రయోజనాన్ని పొందవచ్చు.
నిరంతరం సమీక్షిస్తూ ఉండాలి!
How To Adjust And Renew Your Investments : వాస్తవానికి మార్కెట్ సంక్షోభాలు.. మన పెట్టుబుడులను సమీక్షించుకునేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తాయి. ఇలాంటి సందర్భంలో మంచిగా పెర్ఫార్మ్ చేసే స్టాక్లను అలానే కొనసాగిస్తూ.. భవిష్యత్ ఏమాత్రం ఆశాజనకం లేని షేర్లను వదిలించుకోవాలి. ఈ విధంగా మీ పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు సమతౌల్యం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈక్విటీలు లాంటి అసురక్షిత పథకాల్లో పెట్టుబడులు కొనసాగిస్తూనే.. ప్రభుత్వ స్కీమ్‌లు, బ్యాంక్ ఎఫ్డీలు లాంటి సురక్షిత పథకాల్లోనూ పెట్టుబడులు పెట్టాలి. ఈ విధంగా సమయానుకూలంగా, సరైన ప్రణాళికతో పెట్టుబడులు కొనసాగించాలి.
రియల్ వాల్యూను గుర్తించాలి!
How To Know The Real Value Of A Stock :స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉన్నప్పుడు.. మంచి యాజమాన్యం, పనితీరు బాగున్న సంస్థల షేర్లు చాలా తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తాయి. వెంటనే వాటిని అందిపుచ్చుకోవాలి. దీర్ఘకాలిక దృష్టితో వీటిలో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయాలి. అయితే ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే ముందు.. మీరు ఎంత మేరకు నష్టాన్ని భరించగలరో చూసుకోవాలి. అవసరమైతే కచ్చితంగా నిపుణుల సలహాలు తీసుకోవాలి.
అవగాహన ఉంటేనే..
How To Invest In Stock Market : స్టాక్ మార్కెట్ పెట్టుబడులు చాలా రిస్క్‌తో కూడుకున్నవి. కనుక స్టాక్ మార్కెట్‌పై సరైన అవగాహన ఉన్నప్పుడే.. దానిలో పెట్టుబడులు పెట్టాలి. ఎవరో చెప్పారని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ఏమాత్రం మంచిది కాదు. మీకు గనుక స్టాక్ మార్కెట్లపై అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.
పెట్టుబడులు వైవిధ్యంగా ఉండాలి!
How To Diversify Your Portfolio : పెట్టుబడులు పెట్టేటప్పుడు నష్టభయం చాలా పరిమితంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం మీ పోర్టుఫోలియోను డైవర్సిఫై చేయాలి. అంటే మీ సొమ్మును ఒకే చోట లేదా ఒకే స్కీమ్‌లో కాకుండా.. వివిధ పథకాలకు కేటాయించాలి. రిస్క్, రివార్డ్ ఎక్కువగా ఉండే పథకాల్లో కొంత సొమ్ము; రిస్క్, రివార్డ్ తక్కువగా ఉంటే పథకాల్లో మరికొంత సొమ్ము మదుపు చేయాలి. అంటే కేవలం ఈక్విటీ ఆధారిత పెట్టుబడులే కాకుండా.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల లాంటి స్థిరాదాయ పథకాలనూ ఎంచుకోవాలి. వాస్తవానికి ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి బంగారానికి ఉంది. అందుకే, మీ పోర్టుఫోలియోలో 5-10 శాతం సొమ్మును బంగారంపై పెట్టుబడికి కేటాయించాలి. అప్పుడే మీ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. మీ ఆర్థిక లక్ష్యం కూడా నెరవేరుతుంది.
Upcoming Tata EV Cars : 500 కి.మీ రేంజ్‌తో.. సూపర్ స్టైలిష్ లుక్స్‌తో.. రానున్న టాటా 'ఈవీ' కార్స్ ఇవే!
Bank Holidays In November 2023 : నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!