సొంత వాహనంలో ప్రయాణించడం ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. ముఖ్యంగా పండగల వేళ సొంతూర్లకు వెళ్లడం ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. వాహనాన్ని ఎప్పుడూ సమగ్ర బీమా పాలసీ, అనుబంధ పాలసీల (యాడ్-ఆన్)తో సిద్ధంగా ఉంచుకోవాలి. దురదృష్టవశాత్తూ జరిగే ప్రమాదాలు లేదా కారు పాడవటం వంటి సమయాల్లో ఆర్థిక రక్షణ కల్పించేలా ఇవి ఉపయోగపడతాయి.
ఇంజిన్ రక్షణ కవచం: కారు ఇంజిన్ ఎప్పుడైనా మొరాయించవచ్చు. కారులో ఇదే ఖరీదైన భాగమనే సంగతి తెలిసిందే. ఇంజిన్ వైఫల్యం సంభవించినప్పుడు దానికి పరిహారం ఇచ్చేలా 'ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్' ఉపయోగపడుతుంది. మీ పర్యటనల్లోనే కాకుండా ఏడాది మొత్తంలో ఎప్పుడు ఇంజిన్ ఫెయిల్ అయినా ఈ అనుబంధ పాలసీ సహాయపడుతుంది. ఇంజిన్ మరమ్మతు లేదా కొత్త ఇంజిన్‌ను బిగించుకునే ఖర్చును చెల్లిస్తుంది.
టైర్ ప్రొటెక్టర్ కవర్: సుదీర్ఘక ప్రయాణాలు చేసేటప్పుడు వాహనం టైర్లు మంచి స్థితిలో ఉండాలి. ఎక్కువ గంటలు ఆగకుండా కారును నడిపినప్పుడు టైర్లు దెబ్బతినే ఆస్కారం ఉంది. రోడ్లు సరిగా లేకపోతే టైర్లు తొందరగా పాడవుతాయి. ఈ యాడ్ ఆన్ కవర్ ఉంటే.. టైర్లు పాడైనప్పుడు, కొత్త వాటిని కొనే ఖర్చును తిరిగి పొందవచ్చు.