తెలంగాణ

telangana

ETV Bharat / business

డాలరుపై తిరుగుబాటు.. ప్రత్యామ్నాయం దిశగా ప్రపంచ దేశాలు - తగ్గుతున్న డాలర్ ప్రభావం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో శక్తిమంతంగా ఉన్న డాలరు ప్రభావం క్రమంగా తగ్గుతుంది. డాలరు ప్రత్యామ్నాయం కోసం అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

all countries are trying for dollar substitute in recent times
డాలర్

By

Published : Dec 26, 2022, 7:50 AM IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో శక్తిమంతంగా ఉన్న డాలరు ప్రభావం క్రమంగా తగ్గనుందా.. అంటే అవుననే పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పాటు చిన్న దేశాలు కూడా విదేశీ వాణిజ్యం కోసం డాలరుకు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఒక్క ఆసియాలోనే కనీసం 12 దేశాలు ఇదే బాటను అనుసరిస్తున్నాయి. ఇంతలా ప్రపంచ దేశాలు డాలరును ఎందుకు దూరం పెడుతున్నాయో చూద్దాం.

యూఎస్‌ డాలరు, అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థను సరిగ్గా వినియోగించుకోవడంలో జో బైడెన్‌ ప్రభుత్వం తప్పు చేసిందని మిలీనియం వేవ్‌ అడ్వైజర్స్‌ ప్రెసిడెంట్‌, పెట్టుబడుల వ్యూహకర్త జాన్‌ మాల్డిన్‌ వెల్లడించారు. ఈయనకు 3 దశాబ్దాలకు పైగా మార్కెట్‌లో అనుభవం ఉంది. యూఎస్‌యేతర పెట్టుబడిదార్లు, దేశాలు సంప్రదాయ సురక్షిత స్వర్గధామంగా పిలుచుకునే అమెరికాకు బయటే తమ పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారని జాన్‌ వివరించారు.

ద్వైపాక్షిక చెల్లింపులు

  • రష్యా, చైనాలు తమ కరెన్సీలను అంతర్జాతీయ చెల్లింపులకు వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బ్లాక్‌చైన్‌ సాంకేతికతను వినియోగించుకుని చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం తర్వాత రష్యా తమ దేశం నుంచి సరఫరా చేస్తున్న ఇంధనం కోసం రూబెల్స్‌లో చెల్లించాలంటూ సూచిస్తోంది. బంగ్లాదేశ్‌, కజకిస్థాన్‌, లావోస్‌లు కూడా యువాన్‌లలో చెల్లించేందుకు చైనాతో మంతనాలు చేస్తున్నాయని సమాచారం.
  • భారత్‌ రూపాయిని అంతర్జాతీయీకరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న సంగతి విదితమే. ఈ నెలలోనే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)తో ద్వైపాక్షిక చెల్లింపు వ్యవస్థను సురక్షితంగా ప్రారంభించింది. రష్యాతోనూ రూపాయల్లో చెల్లించేందుకు భారత్‌లో ప్రత్యేక వోస్ట్రో ఖాతాలు తెరుస్తున్న సంగతి విదితమే.
  • చైనా 2022 తొలి అర్ధ భాగంలో రికార్డు స్థాయిలో 49.1 శాతం మేర విదేశీ చెల్లింపులు, స్వీకరణలు చేసింది.
  • ఇండోనేసియా కూడా తమ స్థానిక కరెన్సీలో దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా కేంద్ర బ్యాంక్‌లతో సెటిల్‌మెంట్‌ చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.
    లావోస్‌లోని కేంద్ర బ్యాంక్‌.. వాణిజ్య బ్యాంకులు విదేశీ కరెన్సీలను విక్రయించడాన్ని నిషేధించింది.

డాలరు బలోపేతం
బ్లూమ్‌బెర్గ్‌ డాలర్‌ సూచీ ప్రకారం, ఈ ఏడాది యూఎస్‌ డాలరు 7 శాతం బలోపేతం అయింది. 2015 నుంచి వార్షిక వృద్ధి ఇప్పుడే అధికం. సెప్టెంబరులో రికార్డు స్థాయికి చేరింది. దీంతో బ్రిటిష్‌ పౌండ్‌, భారత రూపాయి చారిత్రాత్మక కనిష్ఠాలకు చేరాయి. డాలరు బలోపేతం కావడం ఆసియా దేశాలకు తలనొప్పి వ్యవహారంగా మారుతోంది. ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి. విదేశీ వాణిజ్య అప్పులు తిరిగి చెల్లించడం కార్పొరేట్లకు కష్టమవుతోంది. పేదరికం మరింతగా పెరుగుతోంది.శ్రీలంక తొలిసారిగా డాలరు రుణాలను తీర్చలేక డిఫాల్ట్‌ అయ్యింది. ఇంధన సరఫరా పోరాటాలకు ఒక దశలో డాలరును నిందిస్తూ వియత్నాం అధికారులు స్పందించారు. దశాబ్దాలుగా కరెన్సీల్లో ‘కింగ్‌’గా పేరు తెచ్చుకున్న డాలరు మరి కొన్ని దశాబ్దాల పాటు తన ఉనికిని కాపాడుకోవచ్చు. కానీ భౌగోళిక, రాజకీయ కారణాలతో ఆయా దేశాలు తమ సొంత మార్గంలో వెళ్లాలని అనుకుంటే ప్రత్యామ్నాయ కరెన్సీల్లో లావాదేవీల చెల్లింపు వ్యవస్థలు జోరందుకోవడం మందగించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు డాలరుకు వచ్చిన ముప్పేమీ లేకున్నా, ప్రపంచం మొత్తం ప్రత్యామ్నాయం వైపు చూస్తుండటం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details