Akasa air news: బిగ్‌బుల్‌గా పేరొందిన ప్రముఖ మదుపరి రాకేశ్ ఝున్‌ఝున్ వాలా మరికొందరితో కలిసి నెలకొల్పిన ఆకాశ ఎయిర్‌కు కీలక అనుమతులు లభించాయి. కమర్షియల్ విమానాలు నడిపేందుకు కావాల్సిన లైసెన్సులను ఆ కంపెనీ పొందింది. ఈ విషయాన్ని ఆకాశ ఎయిరే స్వయంగా గురువారం ట్విటర్ వేదికగా వెల్లడించింది.
విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ నుంచి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ (ఏఓసీ) పొందినట్లు ఆకాశ ఎయిర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదో కీలక మైలురాయిగా అభివర్ణించిన ఆ సంస్థ.. త్వరలోనే కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ నెలాఖరులో తొలుత రెండు విమానాలతో సేవలు ప్రారంభిస్తామని పేర్కొంది. దశలవారీగా ఈ సంఖ్యను పెంచుకుంటూ వెళ్లనున్నట్లు తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 18 విమానాలతో సేవలు అందించనున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత కూడా ఏటా విమానాల సంఖ్యను పెంచుకుంటూ వెళతామని కంపెనీ తెలిపింది.