తెలంగాణ

telangana

ETV Bharat / business

'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్! ఆ రంగాల్లోనే అధికం.. బాంబు పేల్చిన గోల్డ్​మన్ శాక్స్ - ఏఐ జాబ్ లాస్

కృత్రిమ మేధ సాంకేతికతలో వస్తున్న మార్పుల వల్ల 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని గోల్డ్​మన్ శాక్స్ అంచనా వేసింది. అయితే, సాంకేతికత పురోగతి వల్ల ఉత్పాదకత పెరిగి... ప్రపంచ జీడీపీ 7శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.

AI JOBS loss
AI JOBS loss

By

Published : Mar 30, 2023, 7:29 AM IST

కృత్రిమ మేధతో చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్న భయాలు నెలకొన్న వేళ అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్ మన్ శాక్స్ బాంబు పేల్చింది. కృత్రిమ మేధ సాంకేతికతలో వస్తున్న కొత్త ఒరవడులు 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేసింది. ఆర్థిక ప్రగతిపై కృత్రిమ మేధ ప్రభావం ముప్పు పేరుతో చేసిన పరిశోధనా అంశాలను గోల్డ్‌మన్ శాక్స్ వెల్లడించింది. చాట్​జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్.. అంచనాల మేరకు పనిచేస్తే శ్రామికరంగంలో ఒడిదొడుకులు ఉంటాయని తెలిపింది.

ప్రస్తుతం ఎన్నోరకాల పనులకు కృత్రిమ మేధ ప్రత్యామ్నాయంగా మారుతోందని గోల్డ్ మన్ శాక్స్ పేర్కొంది. అయితే, సాంకేతికత పురోగతి వల్ల ఉత్పాదకత పెరిగి.... ప్రపంచ జీడీపీ 7శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ఉద్యోగాలపై ప్రభావం వేర్వేరు రంగాల్లో వేర్వేరుగా ఉంటుందని వెల్లడించింది. పరిపాలన రంగంలో 46శాతం, లీగల్ ఉద్యోగాల్లో 44శాతం ముప్పు పొంచి ఉన్నట్లు పేర్కొంది. నిర్వహణ, ఇన్​స్టాలేషన్, రిపేర్, నిర్మాణ రంగాలపై కృత్రిమ మేధ ప్రభావం తక్కువ ఉంటుందని గోల్డ్ మన్ శాక్స్ పేర్కొంది.

"ప్రస్తుత ఉద్యోగాల్లో మూడింట రెండొంతుల వరకు ఏదో ఓ విధంగా ఏఐ ద్వారా ప్రభావితమవుతున్నాయి. జనరేటివ్ ఏఐ.. నాలుగో వంతు ఉద్యోగాలను భర్తీ చేయవచ్చు. చాట్​జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ సిస్టమ్స్ మనుషుల మాదిరిగానే కంటెంట్​ను సృష్టిస్తున్నాయి. వీటి ఫలితంగా వచ్చే దశాబ్దంలో ఉత్పాదకత భారీగా పెరగొచ్చు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రారంభంలో ఉద్యోగాల తొలగింపునకు కారణమైనప్పటికీ.. తదనంతర పరిణామాల్లో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించింది. ఏఐని ఉపయోగించుకోవడం వల్ల పని చేసే ప్రదేశాలు మారవచ్చు కానీ.. శ్రామిక ఉత్పాదకత పెరుగుతుంది. వచ్చే పదేళ్లలో ఏటా జీడీపీ 7 శాతం వృద్ధి చెందేందుకు ఇది తోడ్పడుతుంది."
-గోల్డ్​ మన్ శాక్స్ నివేదిక

చాట్​జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్​మన్ సైతం ఇటీవల ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఎంత త్వరగా ఈ పరిస్థితులు వస్తాయనే విషయంపై తాను ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. అయితే, మానవ మేధస్సుకు పరిమితులు ఉండవని, మనుషులు చేయడానికి ఏదో ఒక కొత్త పని ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. "గత కొన్ని దశాబ్దాలుగా సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయి. వీటన్నింటినీ మానవులు బాగా అందిపుచ్చుకున్నారు. మార్పులకు అలవాటు పడటం నేర్చుకున్నారు. కానీ, ఈ మార్పు వేగంగా జరిగితే ఏమవుతుందనేది ఆందోళకరంగా మారింది" అని చెప్పుకొచ్చారు. చాట్​జీపీటీని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉందని శామ్ ఆల్ట్​మన్ పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details