తెలంగాణ

telangana

ETV Bharat / business

అప్పుల ఊబిలో అదానీ గ్రూప్​, లక్షల కోట్లకుపైగా

భారత కుబేరుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ క్రమంగా అప్పుల కూపంలోకి జారుకుంటోందని ఫిచ్‌ గ్రూప్‌ సంస్థ క్రెడిట్‌సైట్స్‌ హెచ్చరించింది. ప్రస్తుత వ్యాపారాల విస్తరణతోపాటు కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్‌ భారీగా అప్పులు చేస్తోందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వ్యాపార సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరించాలన్న కాంక్షతో రుణాలు సేకరిస్తున్న ఈ గ్రూప్‌ అధ్వాన పరిస్థితులు ఎదురైతే తీవ్ర రుణాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

adani
adani

By

Published : Aug 24, 2022, 8:34 AM IST

Updated : Aug 24, 2022, 10:30 AM IST

Adani Group Debts: దేశీయ కుబేరుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ 'తీవ్ర రుణ భారం'లో ఉందని ఫిచ్‌ గ్రూప్​కు చెందిన క్రెడిట్‌సైట్స్‌ పేర్కొంది. ప్రస్తుత వ్యాపారాలతో పాటు కొత్తగా పెట్టనున్న వాటికీ పెట్టుబడుల కోసం రుణాలనే అధికంగా వినియోగిస్తుండడం ఇందుకు నేపథ్యమంటోంది. 'అదానీ గ్రూప్‌: డీప్లీ ఓవర్‌లివరేజ్డ్‌' పేరిట రూపొందించిన నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. 'అత్యంత ఆశావహ దృక్పథంలో, రుణాలతో అదానీ గ్రూప్‌ వృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంది. అధ్వాన పరిస్థితులు ఎదురైతే, ఈ గ్రూప్‌ తీవ్ర రుణాల్లో కూరుకుపోవచ్చు. అప్పుడు ఒకటి, అంత కంటే ఎక్కువ గ్రూప్‌ కంపెనీలు ఎగవేతలకు పాల్పడే అవకాశం ఉంద'ని నివేదిక పేర్కొంది.

1980ల్లో కమొడిటీ ట్రేడరుగా వ్యాపారాన్ని ప్రారంభించిన అదానీ నేతృత్వంలోని గ్రూప్‌ ఇపుడు గనులు, పోర్టులు, విద్యుత్‌ ప్లాంట్లు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, రక్షణ రంగం వరకు విస్తరించింది. తాజాగా 10.5 బిలియన్‌ డాలర్లతో హోల్సిమ్‌కు చెందిన భారత యూనిట్లను కొనుగోలు చేసి సిమెంట్‌ తయారీ రంగంలో ఒక్కసారిగా రెండోస్థానానికి చేరాలనుకుంటోంది. ఈ లావాదేవీలకు చాలావరకు రుణాల ద్వారానే నిధులు సమీకరించింది. ఎన్‌డీటీవీలో మెజారిటీ వాటా కొనుగోలుకు సిద్ధం కావడంతో, వార్తా ఛానళ్ల రంగంలోకీ వచ్చినట్లయింది. వివిధ అంశాలపై ఆ నివేదిక ఏమంటోందంటే..

సంబంధంలేని వ్యాపారాల్లో
గత కొన్నేళ్లుగా అదానీ గ్రూప్‌ విస్తరణ ప్రణాళికల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందువల్ల కంపెనీ రుణ పరమితులు, నగదు ప్రవాహాలపై ఒత్తిడి అధికమవుతోంది. అదానీ గ్రూప్‌ ప్రస్తుత వ్యాపారాలతో సంబంధం లేని కొత్త వ్యాపారాల్లోకి విస్తరిస్తోంది. ఇందు కోసం భారీ మూలధనం అవసరమవుతోంది. ఇది ఆందోళన కలిగిస్తోంది.

నష్టభయాలు ఇలా
అదానీ గ్రూప్‌ తమ కంపెనీల్లోకి ప్రమోటరు ఈక్విటీ క్యాపిటల్‌ను జొప్పిస్తున్నందున.. పర్యావరణ, సామాజిక, పాలన(ఈఎస్‌జీ) విషయంలో ఒక మాదిరి నష్టభయాలను ఎదుర్కోవచ్చు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా బలమైన, స్థిరమైన కంపెనీలు చేజిక్కించుకునే అలవాటు అదానీ గ్రూప్‌నకు ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి అవసరమైన స్థిరమైన మౌలిక ఆస్తులు తమ వద్ద ఉన్నాయని ఆ గ్రూప్‌ చెబుతోంది.

ఇదీ అప్పుల లెక్క..
2021-22 చివరకు అదానీ గ్రూప్‌నకు చెందిన 6 నమోదిత కంపెనీల స్థూల రుణాలు రూ.2,30,900 కోట్లుగా ఉన్నాయి. నగదు నిల్వలను లెక్కవేశాక నికర రుణాలు రూ.1,72,900 కోట్లుగా తేలాయి. ప్రస్తుత, కొత్త వ్యాపారాలన్నిటిపైనా దూకుడుగా పెట్టుబడులు పెడుతున్నందున లివరేజీ, సాల్వెన్సీ నిష్పత్తులు పెరుగుతున్నాయి. ఇది గ్రూప్‌ మొత్తం మీద ఆందోళన కలిగించేలా చేస్తోందని క్రెడిట్‌ సైట్స్‌ పేర్కొంది. గ్రూప్‌లోని బాండ్ల జారీ సంస్థల రుణ నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. ఏ కంపెనీ అయినా రుణ ఒత్తిడిలోకి పడే అవకాశాన్ని ఇది పెంచుతుందని పేర్కొంది.

కొత్త సంస్థలు వెంటనే లాభాల్లోకి వెళ్లవు
ఇప్పటిదాకా అనుభవం లేని కాపర్‌ రిఫైనింగ్‌, పెట్రోరసాయనాలు, టెలికాం, అల్యూమినియం ఉత్పత్తి వంటి వాటిలోనూ అదానీ గ్రూప్‌ విస్తరిస్తోంది. ప్రారంభ సంవత్సరాల్లో ఇవి లాభాలను నమోదు చేయలేవు. అంటే రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉండదు. దీని వల్ల రోలోవర్‌/రీఫైనాన్సింగ్‌ అవసరాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇందుకు బ్యాంకింగ్‌ సంబంధాలు, బలమైన క్యాపిటల్‌ మార్కెట్‌ పరిస్థితులు కలిసి రావాలి.

10 ఏళ్ల తర్వాత..
ప్రస్తుతం 6 నమోదిత కంపెనీలకూ గౌతమ్‌ అదానీ(60) ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు బోర్డుల్లో ఉన్నారు. అదానీకున్న దృక్పథం, వేగం ఆయనకే సొంతం. గ్రూప్‌ కంపెనీల్లో ఆయన లేకుంటే సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ సామర్థ్యం అంతగా సరిపోదు. వచ్చే 10 ఏళ్లలో తదుపరి తరానికి ఆయన వ్యాపార సామ్రాజ్య పగ్గాలు అప్పజెప్పొచ్చు. ఆయన కుమారుడు కరణ్‌ అదానీ లేదా సోదరుడు రాజేశ్‌ కుమారులైన సాగర్‌, ప్రణవ్‌లలో ఎవరికి పగ్గాలు ఇస్తారన్నది గౌతమ్‌ అదానీ ఇంకా బయటకు చెప్పలేదని క్రెడిట్‌ సైట్స్‌ పేర్కొంది.

గ్రూప్‌ షేర్లు డీలా
ఈ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు డీలాపడ్డాయి. అదానీ పవర్‌ 4.99%, అదానీ విల్మర్‌ 4.73%, అదానీ గ్రీన్‌ 4.15%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 0.93%, అదానీ పోర్ట్స్‌ 0.32% చొప్పున నష్టపోయాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 3.23%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 1.73% చొప్పున రాణించాయి.

ఇవీ చదవండి:మీడియా రంగంలోకి అదానీ, ఎన్​డీటీవీలో పెట్టుబడులు

అవన్నీ తెలుసుకున్నాకే సూచీ ఫండ్లలో పెట్టుబడులు, ప్రయోజనాలు ఇవే

Last Updated : Aug 24, 2022, 10:30 AM IST

ABOUT THE AUTHOR

...view details