Siam: ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో మన దేశం నుంచి 1,60,263 ప్రయాణికుల వాహనాలు ఎగుమతి అయ్యాయి. 2021 ఇదే త్రైమాసికంలో ఎగుమతి అయిన 1,27,083 వాహనాలతో పోలిస్తే ఈసారి 26 శాతం ఎక్కువగా జరిగాయి. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఈసారి అధికంగా ఎగుమతి కావడం, ఏడాది క్రితం కొవిడ్-19 రెండో దశ ఉద్ధృతి కారణంగా తక్కువ ఎగుమతులు కావడంతో, ఈసారి సంఖ్య ఎక్కువగా కనపడుతోందని భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్) తెలిపింది.
కార్ల ఎగుమతులు 55,547 నుంచి 88 శాతం వృద్ధితో 1,04,400కు చేరాయి. వ్యాన్‌ల ఎగుమతులు 588 నుంచి 316కు తగ్గాయి. అంతర్జాతీయ బ్రాండ్‌లకు దీటుగా నాణ్యతతో పాటు, పోటీ ధరలకు ఎగుమతి చేయడం కలిసి వస్తోందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మేనన్ తెలిపారు. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, కియా ఇండియా తొలి 3 స్థానాలు దక్కించుకున్నాయి.
* మారుతీ సుజుకీ ఎగుమతులు 45,056 నుంచి 53 శాతం పెరిగి 68,987కు చేరాయి. ఎక్కువగా ఎగుమతి అయిన మోడళ్లుగా బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్-ప్రెసో, బ్రెజా నిలిచాయి.
*హ్యుందాయ్ ఎగుమతులు 15 శాతం అధికమై 34,520కు చేరాయి.. కియా ఎగుమతులు 12,448 నుంచి 21,459కు పెరిగాయి. నిస్సాన్ (11,419 యూనిట్లు), ఫోక్స్‌వ్యాగన్ (7146), రెనో (6658), హోండా కార్స్ (6533) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.