ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్ మదుపర్లలో ఉత్సాహం నింపగా.. స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 848 పాయింట్లు లాభపడి 58,863 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 237 పాయింట్ల వృద్ధితో 17,577 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా..
బడ్జెట్ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 58,672 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. మిడ్ సెషన్ వరకు లాభాలతో కొనసాగాయి. 59,032 వద్ద సెన్సెక్స్ గరిష్ఠాన్ని చేరింది. బడ్జెట్ ప్రసంగం అనంతరం కొద్దిసేపు ఒడుదొడుకులకు లోనై 57,737 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది. ఆ తర్వాత సూచీలు లాభాలవైపు పయనించాయి. చివరకు సెన్సెక్స్ 848 పాయింట్లు లాభపడి 58,863 వద్ద స్థిరపడింది.
ఎన్ఎస్ఈ-నిఫ్టీ 17,529 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 17,622 పాయింట్ల గరిష్ఠానికి చేరి.. 17,244వద్ద కనిష్ఠాన్ని తాకింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో టాటా స్టీల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ రాణిస్తున్నాయి.
రిలయన్స్, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్ నష్టపోయాయి.