Algo trading: స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారు నిరంతరం షేర్ల ధరలను పరిశీలిస్తూ, ఆర్డర్లు పెడుతుంటారు. లేదంటే లాభాలు కాస్తా నష్టాలుగా మారొచ్చు. ట్రేడింగ్‌లో భద్రతను పెంచడం కోసం, అవకతవకలు జరగకుండా చూసేందుకు రిటైల్ మదుపర్ల కోసం ప్రత్యేకంగా అల్గారిథమ్ ట్రేడింగ్(అల్గో ట్రేడింగ్)ను తీసుకురావడానికి నిబంధనావళిని సెబీ ప్రతిపాదించింది.
ఏమిటీ అల్గో ట్రేడింగ్?
Sebi retail investors: అల్గో ట్రేడింగ్ అంటే ఏదైనా ఆర్డరు ఆటోమేటెడ్ ఎగ్జిక్యూషన్ లాజిక్‌తో తనంతట తానే జనరేట్ అయ్యేలా చేయడం అన్నమాట. అల్గో ట్రేడింగ్ వ్యవస్థ ఎప్పటికప్పుడు లైవ్‌లో షేర్ల ధరలను పరిశీలించి, మదుపరి ముందే సూచించిన ప్రమాణాలకు తగినట్లుగా ఆర్డరు పెడుతుంది. దీని వల్ల మాన్యువల్‌గా ఆర్డర్లను పెట్టడంతో పాటు, లైవ్‌లో షేర్ల ధరలనూ పరిశీలిస్తూ ఉండడం నుంచి మదుపరికి ఉపశమనం కలుగుతుందన్నమాట. ప్రతిపాదిత వ్యవస్థలో రిటైల్ మదుపర్లు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్(ఏపీఐ) యాక్సెస్‌తో పాటు ఆటోమేషన్ ఆఫ్ ట్రేడ్స్‌ను వినియోగించుకుంటారు.
ఇదీ చూడండి:రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమీక్ష హైలైట్స్
ఎందుకంటే..?
Api trading: ప్రస్తుతం బ్రోకర్లు సమర్పించిన అల్గోకు ఎక్స్ఛేంజీలు అనుమతులు ఇస్తున్నాయి. రిటైల్ మదుపర్లు ఏపీఐలను వినియోగించి పెట్టే అల్గోలను అటు ఎక్స్ఛేంజీలు కానీ.. ఇటు బ్రోకర్లు కానీ.. సదరు ట్రేడ్ ఏపీఐ లింక్ నుంచి వచ్చిన అల్గోనా, నాన్ అల్గో ట్రేడా అన్నది గుర్తించలేని పరిస్థితి ఉంది. ఈ తరహా నియంత్రణ లేని లేదా అనుమతి లేని అల్గోల వల్ల మార్కెట్‌కు నష్టభయం పెరుగుతుంది. అదే సమయంలో వీటిని వినియోగించి వ్యవస్థీకృత అవకతవకలకు పాల్పడే అవకాశమూ ఉంది. ఏదైన అల్గో వ్యూహం విఫలమైతే రిటైల్ మదుపరికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందునే మార్పులు ప్రతి పాదించారు.
నియంత్రణ ఇలా..
Regulation trade:థర్డ్ పార్టీ అల్గో ప్రొవైడర్లు/వెండర్లపై ఎటువంటి నియంత్రణా లేకపోవడం వల్ల ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కూడా లేదు. అందుకే సెబీ కొత్త ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. అవేంటంటే.. ఏపీఐ నుంచి వచ్చే అన్ని ఆర్డర్లనూ అల్గో ఆర్డర్లుగా గుర్తిస్తారు. వీటిని స్టాక్‌బ్రోకరు నియంత్రించాల్సి ఉంటుంది. ఏపీఐలు తమ అల్గో ట్రేడింగ్‌ను ఒక విశిష్ట అల్గో ఐడీతో ట్యాగ్ చేయాలి. అపుడు ఆ అల్గోకు స్టాక్ ఎక్స్ఛేంజీ నుంచి అనుమతి వస్తుంది.
- ప్రతీ అల్గో వ్యూహం.. అది బ్రోకరుది అయినా క్లయింటుది అయినా.. ఎక్స్ఛేంజీ అనుమతి పొందాలి. అదే సమయంలో అల్గోలను అనధికారికంగా ఎవరూ మార్చకుండా ఉండేందుకు అవసరమైన సాంకేతికత టూల్స్‌ను బ్రోకర్లు వినియోగించాలి.
- బ్రోకర్లు సొంతంగా అల్గో వ్యూహాలను అభివృద్ధి చేసుకోవచ్చు. లేదంటే అనుమతి పొందిన వెండర్ ద్వారా పొందొచ్చు. అయితే మదుపర్ల నుంచి ఫిర్యాదు వస్తే మాత్రం స్టాక్‌బ్రోకర్లే బాధ్యత వహించాలి.
ప్రతిపాదనలపై స్పందనలకు జనవరి 15 వరకు సెబీ గడువునిచ్చింది.
ఇవీ చూడండి: