తెలంగాణ

telangana

ETV Bharat / business

రెపోరేటు యథాతథం- జీడీపీ 9.5 శాతం క్షీణత

Monetary Policy Committee (MPC)
ద్రవ్య పరపతి విధానం

By

Published : Oct 9, 2020, 10:24 AM IST

Updated : Oct 9, 2020, 11:54 AM IST

11:47 October 09

మార్కెట్ వర్గాల అంచనాలను నిలబెడుతూ భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగానే  కొనసాగించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. రెపో రేటును 4శాతంగా, రివర్స్‌ రెపో రేటును 3.35శాతంగానే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.  

రెపో రేటు మాదిరిగానే బ్యాంకు రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.2 వద్ద యథాతథంగా ఉంచినట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. 2021 సంవత్సరానికి వాస్తవ జీడీపీ 9.5 శాతం క్షీణస్తుందని అంచనా వేశారు. వృద్ధి రేటు మరింత క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

కరోనాపై పోరులో భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం నిర్ణయాత్మక దశలోకి ప్రవేశించిందని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశముందని అంచనా వేశారు. అప్పటికీ జీడీపీ వృద్ధి రేటు కూడా పాజిటివ్‌ జోన్‌లోకి వచ్చే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడో త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు గాడిలో పడతాయన్నారు.  

ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద సరిపడా నగదు ఉందని శక్తికాంత దాస్‌ తెలిపారు. వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచేందుకు వచ్చే వారంలో రూ. 20,000 కోట్ల మేర ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

11:15 October 09

కోలుకుంటున్న ఆర్థికం

రెండో త్రైమాసికం(జులై-సెప్టెంబర్)లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని పేర్కొన్నారు ఆర్​బీఐ గవర్నర్. తొలి త్రైమాసికంలో "-23.9" శాతం జీడీపీ వృద్ధి నమోదైన తర్వాత నుంచి ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం సాధిస్తోందని చెప్పారు. ప్రభుత్వ వ్యయాలతో పాటు గ్రామీణ డిమాండ్ పెరగడం వల్ల తయారీ రంగం కోలుకుందని తెలిపారు. వ్యవసాయ రంగం అత్యంత పటిష్ఠంగా ఉందని పేర్కొన్నారు. వర్తక ఎగుమతులు నెమ్మదిగా కొవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటున్నాయని వివరించారు.

కొవిడ్ కారణంగా ఏర్పడిన కార్మికుల కొరత, అధిక రవాణా ఛార్జీల వల్ల ధరలపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు ఆర్​బీఐ గవర్నర్.

10:54 October 09

అన్ని వేళలా ఆర్​టీజీఎస్

డిసెంబర్ నుంచి ఆర్​టీజీఎస్​ చెల్లింపు పద్ధతిని అన్ని రోజుల్లో 24 గంటల పాటు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. దేశీయ వ్యాపారాలు, సంస్థలకు వేగవంతమైన చెల్లింపులు జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

2020 సెప్టెంబర్​లో తయారీ కొనుగోలు నిర్వాహకుల(మ్యానుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్​) సూచీ 56.8 శాతం పెరిగిందని తెలిపారు శక్తికాంత దాస్. 2012 జనవరి తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల అని వెల్లడించారు.

10:46 October 09

'సెప్టెంబర్​లోనూ ద్రవ్యోల్బణం పెరుగుదల'

సెప్టెంబర్​లో ద్రవ్యోల్బణం పెరుగుదల నమోదు చేసినప్పటికీ.. రానున్న మూడు, నాలుగు త్రైమాసికాలలో ద్రవ్యోల్బణ రేటు క్రమంగా తగ్గి లక్ష్యాన్ని చేరుకుంటుందని పేర్కొన్నారు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ద్రవ్యోల్బణం పెరగడానికి సరఫరాలో అంతరాయాలు, సంబంధిత మార్జిన్లే ప్రధాన కారణాలని స్పష్టం చేశారు.

మార్కెట్​లో ద్రవ్య లభ్యత సులభతరం చేయడం కోసం మరిన్ని చర్యలు తీసుకునేందుకు ఆర్​బీఐ సిద్ధంగా ఉందని ప్రకటించారు శక్తికాంత దాస్.

10:34 October 09

కుంగిన జీడీపీ వృద్ధి రేటు

రెపో రేటు మాదిరిగానే బ్యాంకు రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.2 వద్ద యథాతథంగా ఉంచినట్లు పేర్కొన్నారు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. రివర్స్ రెపోరేటు 3.35 శాతం వద్దే ఉంటుందని స్పష్టం చేశారు.  

మరోవైపు, 2021 సంవత్సరానికి వాస్తవ జీడీపీ 9.5 శాతం క్షీణస్తుందని అంచనా వేశారు శక్తికాంత దాస్. వృద్ధి రేటు మరింత క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

10:10 October 09

రెపోరేటును యథాతథంగా(4 శాతం వద్ద) ఉంచాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ఏకగ్రీవంగా అంగీకారానికి వచ్చినట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, వచ్చే ఏడాదితో పాటు అవసరమైనంతవరకు ద్రవ్య విధానంలో తన వైఖరిని కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించినట్లు తెలిపారు.

Last Updated : Oct 9, 2020, 11:54 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details