కొవిడ్ వ్యాధిని అదుపు చేయడంలో మోల్నుపిరవిర్(Molnupiravir Covid) ఎంతో ప్రభావ వంత ఫలితాలు నమోదు చేసిందనే అంశం స్థానిక ఫార్మా కంపెనీలకు మేలు చేయనుంది. ఈ ఔషధంపై అమెరికా, కెనడా దేశాల్లో ఎంఎస్‌డీ ఫార్మా, రిడ్జ్‌బ్యాక్ బయోథెరప్యూటిక్స్‌లు క్లినికల్ పరీక్షలు నిర్వహించాయి. మూడో దశ పరీక్షల మధ్యంతర ఫలితాలను తాజాగా ఈ కంపెనీలు వెల్లడించాయి. కరోనా వైరస్ వ్యాధి సోకిన వెంటనే మోల్నుపిరవిర్(Molnupiravir Covid) ఔషధాన్ని తీసుకుంటే, ఆసుపత్రి పాలయ్యే అవసరం కానీ, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కానీ 50 శాతం మేరకు తగ్గిపోతున్నట్లు ఈ పరీక్షల్లో తేలినట్లు వివరించాయి. దీంతో ఈ ఔషధంపై వైద్య, ఫార్మా వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఇదీ నేపథ్యం
‘మోల్నుపిరవిర్’(Molnupiravir Covid) ను అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీకి చెందిన బయోటెక్నాలజీ సంస్థ- ఎమోరీ ఎల్‌ఎల్‌సి. ఆవిష్కరించింది. తదుపరి దీన్ని ఎంఎస్‌డీ ఫార్మా, రిడ్జ్‌బ్యాక్ బయోథెరప్యూటిక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. క్లినికల్ పరీక్షల ఫలితాలు సానుకూలంగా ఉండటంతో పెద్దఎత్తున ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేయటానికి ఎంఎస్‌డీ ఫార్మా సిద్ధమవుతోంది. ఇందుకు వీలుగా అత్యవసర వినియోగ అనుమతి (ఈయూఎల్) కోసం యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద ఎంఎస్‌డీ ఫార్మా దరఖాస్తు చేయనుంది.
దివీస్ కీలకపాత్ర
ఈ ఔషధ ఉత్పత్తిలో మనదేశానికి చెందిన ఫార్మా కంపెనీలు అత్యంత క్రియాశీలకం కానున్నాయి. హైదరాబాద్‌కు చెందిన దివీస్ లేబొరేటరీస్ ముఖ్యమైన పాత్ర పోషించనుంది. మోల్నుపిరవిర్‌ను ఎంఎస్‌డీ ఫార్మా తరఫున మనదేశంలో ఆరేడు కంపెనీలు ఉత్పత్తి చేయనున్నాయి. ఇందులో డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ఎమ్‌క్యూర్, సన్ ఫార్మా, టోరెంట్, హెటెరో తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటికీ మోల్నుపిరవిర్ ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్) ని దివీస్ లేబొరేటరీస్ అందించనుంది.
*స్థానిక ఫార్మా కంపెనీలు మరికొన్ని నేరుగా మోల్నుపిరవిర్(Molnupiravir Covid)ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించడంతో పాటు అంతగా ఔషధ నియంత్రణ లేని దేశాలకు (అన్-రెగ్యులేటెడ్ మార్కెట్లకు) సరఫరా చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో నాట్కో ఫార్మా, లారస్ ల్యాబ్స్, ఆప్టిమస్ ఫార్మా, హానర్ ల్యాబ్స్, మైత్రి ల్యాబ్స్.. తదితర కంపెనీలు ఉన్నాయి.