త్రైమాసిక ఫలితాలు, కరోనా సంబంధిత వార్తలు, మైక్రోఎకనమిక్ డేటా ప్రకటనలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. పలు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా కట్టడి చేస్తాయనేది నిర్ణయాత్మక అంశం అవుతుందని తెలిపారు.
"ఎన్నికల ఫలితాలు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం చాలా తక్కువ. ఆ వార్తల విలువ కొన్ని గంటలకు మించి ఉండదు. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా కట్టడి చేస్తాయనేది ప్రధానాంశంగా ఉంది. కేసులను కట్టడి చేయడానికి లాక్డౌన్ ప్రకటిస్తే అది కచ్చితంగా మార్కెట్కు భారీ నష్టాలను మిగుల్చుతుంది."
-వీకే విజయ్ కుమార్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్
"ఈ వారం మార్కెట్లు ఒడిదొడుకులకు లోనయ్యే ఆవకాశం ఉంది. ఇందుకు పెరుగుతున్న కరోనా కేసులే కారణం. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు వచ్చాయి. సోమవారం ప్రారంభ సెషన్లో మదుపరులు రిలయన్స్పై దృష్టి సారించే అవకాశం ఉంది. "