ఐదు రోజుల నష్టాలకు బ్రేకులు వేస్తూ దేశీయ సూచీలు శుక్రవారం భారీ లాభాలు నమోదు చేశాాయి. వారాంతపు సెషన్లో ఆరంభంలో ఒడుదొడుకుల మధ్య సాగినా.. చివరకు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 642 పాయింట్లు పెరిగి 49,858 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 186 పాయింట్ల లాభంతో 14,744 వద్దకు చేరింది.
క్రమంగా పెరుగుతోన్న కరోనా కేసులు, అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో గత ఐదు సెషన్లుగా దేశీయ సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. శుక్రవారం ఆరంభ సెషన్లోనూ మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. అయితే మిడ్ సెషన్ తర్వాత విద్యుత్, ఎఫ్ఎంసీజీ, లోహ షేర్లు భారీగా పుంజుకోవడం వల్ల లాభాలను నమోదు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,004 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,587 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,788 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 14,350 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.