రెండు మూడు వారాలుగా మదుపరి దినచర్య ఇదే. శనివారం, ఆదివారం మినహా మిగతా రోజుల్లో వాళ్లకు ప్రశాంతతే కరవైపోయింది. రేపు ఎంత నష్టాన్ని చూడాల్సి వస్తుందేమోననే దిగులుతో రాత్రులు నిద్ర పట్టనివాళ్లు కొందరైతే.. మార్కెట్ ప్రారంభయయ్యాక ఎప్పుడు ముగుస్తుందోనని ఎదురుచూసే వాళ్లు మరికొందరు. ఒక రోజు.. రెండు రోజులైతే ఫర్వాలేదు.. వారాలు వారాలు వరుస పతనాలు వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరోనా వ్యాప్తి ఇప్పుడే ఆగిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. కనీసం స్టాక్ మార్కెట్ నష్టాల ప్రవాహాన్ని ఆపేందుకైనా చర్యలు చేపట్టమని వినతులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజులు స్టాక్ మార్కెట్‌ను మూసివేయండని అడుగుతున్నారు. బ్రిటన్, అమెరికాలో ఇప్పటికే ఆ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి కూడా. మన దేశంలో కొంతమంది విశ్లేషకులూ ఇదే మాట చెబుతున్నారు. అసలు ఇప్పుడు నిజంగానే స్టాక్ మార్కెట్‌ను మూసివేయాల్సిన పరిస్థితి ఉందా? ఒకవేళ మూసివేస్తే ఏం జరుగుతుంది? గతంలో ఎప్పుడైనా.. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయా..?
ఎందుకు మూసి వేయాలి..
స్టాక్ మార్కెట్‌ను మూసివేయమని చెప్పేవాళ్లు చెబుతున్న ప్రధాన కారణం.. హద్దూ అదుపూ లేకుండా షేర్లు పడిపోవడం. ఎంతో పటిష్ఠ మూలాలున్న షేర్లూ అతలాకుతలం అవుతుండటం మదుపర్లను కలచివేస్తోంది. దీర్ఘకాలిక ఆలోచనతో నాణ్యమైన షేర్లను మదుపర్లు కొనుగోలు చేసి అట్టేపెట్టుకుంటారు. లాభాలొచ్చినా సరే.. ఎన్నో ఏళ్లుగా వాటిని అమ్మేయకుండా కొనసాగిస్తుంటారు. అయితే ప్రస్తుత నష్టాల ప్రవాహంలో షేర్లు 30-50% పడిపోవడంతో.. వచ్చిన లాభాలన్నీ పోగొట్టుకున్న వాళ్లు కొందరైతే, మరింతగా నష్టపోయిన వాళ్లు మరికొందరు. కంపెనీల పనితీరు, వాటిపై నమ్మకం, సాంకేతిక స్థాయిలు ఏవీ ఇప్పుడు పనిచేయడం లేదు. కేవలం భయాలు మాత్రమే. అమ్మడం తప్ప కొనడం అనే మాటే వినిపించడం లేదు. దీంతో షేర్లు సహజ విలువ స్థాయిలనూ కోల్పోయి మరింత కిందకు దిగివస్తున్నాయి.
కరోనా ప్రభావం వల్లే..
ఇలాంటి పరిస్థితి అటు కంపెనీలకు, మదుపర్లకు ఏమాత్రం మంచిది కాదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ డీలాపడొచ్చన్న ఆందోళనల ప్రభావం ఇప్పటికే మార్కెట్‌పై ఊహించని స్థాయిలో తీవ్రంగా పడింది. మున్ముందు ఇంకా పడిపోయే అవకాశాలను కొట్టిపారేయలేం. అలాంటప్పుడు కరోనా భయాలు వీడేవరకు మార్కెట్‌ను మూసివేయడం మంచిదని అంటున్నారు. దీంతోపాటు మరో కారణాన్ని కూడా చెబుతున్నారు. అదేమిటంటే.. సగం మంది ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయించాలని కంపెనీలకు కేంద్రం ప్రభుత్వం సూచించింది కదా. బ్రోకరేజీ సంస్థలు, ఎక్స్ఛేంజీలూ దానిని పాటించే అవకాశం ఉంది. మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులతో కదలాడుతున్న ప్రస్తుత సమయంలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే తగినంత సిబ్బంది అందుబాటులో లేకపోయినా ఇబ్బందులకు దారి తీయొచ్చు. అలాంటప్పుడు మార్కెట్ మూసివేస్తే ఏ సమస్యా ఉండదని సలహా ఇస్తున్నారు.
ఎందుకు మూయొద్దు..
మార్కెట్‌కు ఉత్థాన పతనాలు సహజమని, పెరుగుతున్నప్పుడు కొనసాగించి పడుతున్నప్పుడు మార్కెట్‌ను మూసేయడం సరికాదనే వాదనను చాలా మంది చేస్తున్నారు. అలా చేయడం వల్ల మార్కెట్లో పారదర్శకతపై సందేహాలకు తావిచ్చినట్లు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. దేశీయ విదేశీ మదుపర్ల విశ్వాసమూ దెబ్బతింటుందని చెబుతున్నారు. మార్కెట్‌ను మూసివేసినంత మాత్రాన నష్టాల ప్రవాహం ఆగుతుందని అనుకోవడం భ్రమ అని, తిరిగి ప్రారంభమయ్యాక కూడా భయాలు వెంటాడుతాయని అంటున్నారు. వీళ్ల వాదనలోనూ నిజం లేకపోలేదు. ఎందుకంటే.. అప్పటికప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగానే ఏ షేరైనా పెరగడం, పడటం జరుగుతుంది. కరోనా వైరస్ సృష్టించిన పరిస్థితుల కారణంగా ఫలానా కంపెనీపై పడే ప్రభావం ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో తెలియనందున మార్కెట్‌కు అనుగుణంగానే అవి పతనమవుతున్నాయి. ఒకవేళ పరిస్థితి సద్దుమణిగి, ప్రభావం పరిమితంగానే ఉందని గుర్తిస్తే మార్కెట్‌తో సంబంధం లేకుండా ఆ షేరు పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత వేగంగా పడిందో.. అంతే వేగంగా కరోనా వైరస్ ముందున్న స్థాయికి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. మన పోర్ట్‌ఫోలియోలోని కంపెనీల మూలాలు పటిష్ఠంగా ఉంటే ఎంతటి ఉపద్రవం వచ్చినా పెట్టుబడి చెక్కుచెదరదనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభావమైనా షేర్లపై తాత్కాలికంగానే ఉంటుందని అంటున్నారు. పైగా మార్కెట్‌ను మూసివేస్తే అందులో చాలామంది పెట్టుబడులు ఇరుక్కుపోతాయి. దీంతో నిధుల లభ్యత సమస్య ఏర్పడి ఆర్థిక వ్యవస్థకు కొత్త చిక్కులు ఏర్పడే ప్రమాదమూ ఉంది. వీటన్నింటి రీత్యా మార్కెట్‌ను మూసేయాలని కోరడం సహేతుకం కాదని అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యామ్నాయం ఉందా?
కొవిడ్-19 ప్రభావం నేపథ్యంలో ఫిలిప్పీన్స్ స్టాక్ మార్కెట్‌ను మూసేసింది. కరోనా వైరస్‌కు మూలదేశమైన చైనా షార్ట్ సెల్లింగ్‌ను మాత్రమే ఆపేసింది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ సహా యూరోపియన్ దేశాలు కూడా ఇదే తరహా నిర్ణయాన్ని తీసుకున్నాయి. మన మార్కెట్లలోనూ షార్ట్ సెల్లింగ్ ఆపేస్తే మంచిదని కొందరు సలహా ఇస్తున్నారు. పతనాల నియంత్రణకు స్టాక్ మార్కెట్‌ను మూసివేయడం కంటే షార్ట్ సెల్లింగ్ ఆపడమే ప్రత్యామ్నాయ మార్గమని అంటున్నారు. ఇలా చేస్తే ఒడుదొడుకులు తగ్గి మార్కెట్ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే మన ఎక్స్ఛేంజీల్లో డెరివేటివ్స్ విభాగంలోనే ఎక్కువ పరిణామంలో లావాదేవీలు జరుగుతుంటాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) కూడా ఇందులోనే ఎక్కువగా ట్రేడ్ చేస్తుంటారు. షార్ట్ సెల్లింగ్ ఆపేస్తే లావాదేవీల పరిమాణం బాగా తగ్గిపోతుంది. ఎఫ్‌ఐఐలు కూడా దూరం కావచ్చు. ఎఫ్‌ఐఐలు పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకుంటే మార్కెట్ ఇప్పటికంటే కూడా భారీగా పడిపోయే అవకాశాలు లేకపోలేదు. అందుకే షార్ట్‌సెల్లింగ్‌ను ఆపేసే దిశగా కూడా మన నియంత్రణ సంస్థలు నిర్ణయం తీసుకోకపోవచ్చు.