తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్​బీఐ చర్యలతో.. ఆర్థిక పునరుజ్జీవనం సాధ్యమేనా?

ఆర్థిక మాంద్యం నుంచి బయటపడి భారత ఆర్థికాభివృద్ధి​ పుంజుకుంటుదని ఆశలు పెట్టుకున్నా గత డిసెంబరు త్రైమాసికంలో వృద్ధిరేటు ఉసూరుమనిపించింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రిజర్వు బ్యాంకు చేపడుతున్న చర్యలు ఎంతమేరకు వృద్ధికి ఊతమిస్తాయో చూడాల్సి ఉంది.

With Reserve bank measures ... Is economic revival possible?
రిజర్వు బ్వాంకు చర్యలతో... ఆర్థిక పునరుజ్జీవనం సాధ్యమేనా?

By

Published : Mar 3, 2020, 10:05 AM IST

గడచిన అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఆర్థికాభివృద్ధి రేటు పుంజుకొంటుందని ఆశలు పెట్టుకున్నా చివరకు జీడీపీ వృద్ధి రేటు 4.7 శాతానికి పరిమితమవడం ఉసూరుమనిపించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం జనవరి-మార్చిలో కూడా వృద్ధి రేటు 4.7 శాతాన్ని మించకపోవచ్చు. నిజానికి గతేడాది మూడో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో ఆర్థిక పరిస్థితి మహా దారుణంగా ఉంది. ఆ కాలంలో కార్ల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. కంపెనీల పనితీరు, వినియోగం, వ్యాపారుల ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నాయి. అయినా మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.1 శాతంగా ఉంది. చివరి త్రైమాసికమైన అక్టోబరు-డిసెంబరులో వృద్ధి రేటు అంతకన్నా తగ్గి 4.7 శాతానికి పడిపోవడం శోచనీయం. ప్రభుత్వ వ్యయం అదనంగా 12 శాతం మేర పెరగబట్టి కానీ, లేకుంటే వృద్ధి రేటు 3.5 శాతానికి జారిపోయి ఉండేది.

గిరాకీ-సరఫరా సమతుల్యత ద్వారా...

2019-20 సంవత్సరమంతా ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా వృద్ది రేటును ఆమాత్రమైనా నిలబెట్టగలిగారు. ప్రభుత్వం ఆర్థిక లోటుతో సతమతమవుతున్న దృష్ట్యా వివిధ సంక్షేమ పథకాలపై సర్కారీ వ్యయాన్ని పెంచుకుంటూ పోయి వినియోగాన్నీ, తద్వారా వృద్ధి రేటును నిలబెట్టడం ఎంతో కాలం సాధ్యపడదు. కేవలం గిరాకీ పెంచడం ద్వారా వృద్ధిని సాధించలేం. పెట్టుబడుల సరఫరా, ఉత్పాదక పరికరాల దిగుమతులను పెంచడం కూడా అవసరమే. గిరాకీ-సరఫరాల సమతుల్యత ద్వారా సాధించే అభివృద్ధి నిలకడగా సాగుతుంది. పెట్టుబడులు, దిగుమతులు తగ్గడం వల్లనే గతేడాది వరుసగా రెండు త్రైమాసికాల్లో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయి వృద్ధి రేటు తగ్గిపోయిందని గమనించాలి. వ్యవసాయం, ప్రజాపాలన మినహా పెట్టుబడులు, దిగుమతులు అవసరమైన ప్రతి రంగంలో వృద్ధి మందగించింది.

ప్రధానంగా నిర్మాణ రంగం!

ఇక్కడ ప్రధానంగా నిర్మాణ రంగం గురించి చెప్పుకోవాలి. ఈ రంగంలో సంవత్సరకాలంగా ప్రతి త్రైమాసికంలో వృద్ధి 2.6 పర్సంటేజి పాయింట్ల చొప్పున తగ్గుతూ వస్తోంది. (ఒక శాతంలో ఓ యూనిట్‌ను పర్సెంటేజీ పాయింట్‌ అంటారు). ఆర్థిక మందగమనంలో ఎప్పటికప్పుడు తదుపరి త్రైమాసికంలో వృద్ధి పుంజుకొంటుందని ఆశపెట్టుకోవడం పరిపాటి. గతేడాది చివరి త్రైమాసికంలో వ్యవసాయేతర, ప్రభుత్వేతర జీడీపీలో కొద్దిగా వృద్ధి వీచికలు కనిపించగానే కొందరు విశ్లేషకులు సంబరపడిపోయారు. ఇది పాత నిల్వలను విక్రయించడం వల్ల కనిపించిన వృద్ధి కావచ్చు తప్ప కొత్తగా ఉత్పత్తి, గిరాకీ పుంజుకోవడం వల్ల సంభవించింది కాకపోవచ్చు. ఈ ధోరణి కూడా దీర్ఘకాలం కొనసాగుతుందనే భరోసా ఏమీ లేదు. అలాగని ఆశావహ చిహ్నాలు బొత్తిగా లేవని కాదు- ఈ ఏడాది జనవరిలో ప్రధాన పరిశ్రమల్లో ఉత్పత్తి 2.2 శాతం మేర పెరిగింది. గతేడాది ఆగస్టు-నవంబరు కాలంలో వృద్ధి తిరోగమనంతో పోలిస్తే ఇది సానుకూల సూచనే. ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 8.03 శాతం పెరిగాయి. (ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు 1.05 లక్షల కోట్ల రూపాయలు). ఇది ఆదాయం తగ్గి కటకటలాడుతున్న ప్రభుత్వానికి ఊరట కలిగించే పరిణామం.

బ్యాంకు రుణాలే ఆధారం!

బ్యాంకుల రుణ వితరణ ప్రోత్సాహకరంగా లేదు. కొత్త పరిశ్రమలు నెలకొనాలన్నా, ఉన్న పరిశ్రమలు విస్తరించాలన్నా, ఉత్పత్తిని పెంచుకోవాలన్నా బ్యాంకు రుణాలే ఆధారం. పారిశ్రామిక విస్తరణ వల్ల ఉపాధి, వ్యాపారాలు వృద్ధి అవుతాయి. 2020 జనవరిలో ఆహారేతర రంగాలకు బ్యాంకుల రుణ వితరణ 8.5 శాతం మేరకు పెరిగినా, ఫిబ్రవరి మొదటి పక్షంలో 6.3 శాతానికి తగ్గిపోయింది. జనవరిలో ఏసీలు, ఫ్రిజ్‌ల వంటి వినియోగ వస్తువులు కొనడానికి బ్యాంకుల నుంచి తీసుకునే వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, క్రెడిట్‌ కార్డు రుణాలు బాగా పెరిగాయి. జనవరిలో ఈ తరహా రుణాల్లో 41 శాతం వృద్ధి కనిపించినా, ఫిబ్రవరిలో కార్ల రుణాలు ఏమాత్రం పెరగలేదు. బీఎస్‌-4 ప్రమాణాలతో కూడిన పాత కార్ల నిల్వలను ఖాళీ చేయడం మీద కార్ల కంపెనీలు దృష్టి పెట్టడం దీనికి ఒక ముఖ్య కారణం. వినియోగదారులు కూడా వివిధ కారణాల వల్ల కార్ల కొనుగోళ్లు తగ్గించారు. అందుకే ఫిబ్రవరిలో రుణ వితరణ తగ్గింది. ఈ పరిస్థితిలో తాజా గణాంకాలు చూపుతున్న స్వల్ప వృద్ధి ఎంతకాలం సాగుతుందో తెలియదు.

కరోనా ప్రభావం..!

స్వల్ప కాలంలో మాత్రం జీడీపీ వృద్ధి మీద పెద్ద ఆశలు పెట్టుకోలేమని చెప్పాలి. చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రభావమిది. ఈ వైరస్‌ వ్యాప్తి వల్ల ఇప్పటికే ముడి సరకుల సరఫరా తగ్గిపోయింది. ఫార్మా, కార్లు, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలకు ఇది పెద్ద దెబ్బ. ప్రపంచ ఆర్థికాభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. అది కొన్ని నెలలపాటైనా భారత్‌ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపకమానదు. ఈ ముప్పును పసిగట్టడం వల్లనే ప్రపంచమంతటా స్టాక్‌ మార్కెట్లు డీలా పడుతున్నాయి. ఈ అనిశ్చితి ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తుంది. ఆర్థిక లోటును కట్టడి చేయడానికి ఖర్చులు తగ్గించుకోవాలని కేంద్రం ఇప్పటికే వివిధ మంత్రిత్వ శాఖలను, ప్రభుత్వ విభాగాలను కోరింది. సాధారణంగా బడ్జెట్‌లో కేటాయించినదానికన్నా తక్కువ ఖర్చు పెట్టడం ద్వారా డబ్బు ఆదా చేస్తారు. దీనివల్ల వ్యయం తగ్గి ఆర్థిక లోటు తగ్గుతుంది. 2019-20 బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాల్లో 15 శాతమే ఖర్చు చేయాలని గత డిసెంబరులో ఆదేశించిన కేంద్రం, ఈ ఏడాది మార్చిలో పది శాతమే ఖర్చు చేయాలని నిర్దేశించింది. ఏతావతా స్వల్పకాలంలో దేశం ఆర్థికంగా కోలుకుని వృద్ధి పథంలో పరుగు తీసే అవకాశాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయి. రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించి, రుణ వితరణ పెంచడం ద్వారా వృద్ధికి ఊపు ఇవ్వాలని చూస్తోంది. ఆ ప్రయత్నం సఫలం కావాలని ఆశిద్దాం.

-రేణు కోహ్లీ, ఆర్థికవేత్త

ఇదీ చూడండి:విద్వేష సందేశాలపై ఫిర్యాదు చేస్తే రూ.10 వేల బహుమానం

ABOUT THE AUTHOR

...view details