తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆశల వారధి మోస్తూ.. కరోనా కష్టాలు తీర్చేనా? - What to expect from finance minister Nirmala Sitharaman's Budget 2021-22

కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ.. ఇప్పుడిప్పుడే పూర్తిగా పుంజుకుంటున్న కార్యకలాపాలు.. అన్ని రంగాల్లో ఎన్నో సమస్యలు.. ఇన్ని సవాళ్ల మధ్య కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలా ఉండనుంది? కరోనా కష్టాలను తీర్చి.. ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం అందిస్తుందా? ప్రభుత్వ ప్రాధాన్యాలేంటి? ఇవన్నీ సోమవారం కేంద్ర ప్రభుత్వ లెక్కల పత్రంలోనే తేలేది.

What to expect from finance minister Nirmala Sitharaman's Budget 2021-22
ఆశల వారధి మోస్తూ.. కరోనా కష్టాలు తీరుస్తుందా?

By

Published : Jan 31, 2021, 6:27 PM IST

దేశ ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శనం చేసే బడ్జెట్​కు వేళయింది. 2021-22 సంవత్సరానికి పద్దును సోమవారం పార్లమెంట్​లో ప్రవేశపెట్టనుంది కేంద్రం. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో తాజా బడ్జెట్​కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో దేశం ఎన్నడూ చూడనటువంటి బడ్జెట్​ను ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీతో అందరి దృష్టి సోమవారం జరిగే సమావేశాలపై పడింది.

ఇదీ చదవండి:బడ్జెట్ 2021- నిర్మలమ్మ ముందున్న సవాళ్లు

దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన పద్దు సిద్ధం చేయడం కేంద్రం ముందున్న అతిపెద్ద సవాల్. గత బడ్జెట్​లో వేసిన లెక్కలు కరోనాతో పూర్తిగా తలకిందులయ్యాయి. ప్రభుత్వ వ్యయాలు పెరిగాయి. వార్షిక బడ్జెట్​లో ప్రభుత్వ అంచనాలతో పోలిస్తే.. నవంబర్ నాటికి ద్రవ్యలోటు 119.7 శాతం అధికమైంది. రెవెన్యూ వసూళ్లు పడిపోవడం, కరోనా నియంత్రణకు విధించిన లాక్​డౌన్ వల్ల వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది.

ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ తీసుకొచ్చే బడ్జెట్​ కీలకం కానుంది. బలహీనపడిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే .. డిమాండ్​ను సృష్టించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి ప్రాజెక్టులు, దీర్ఘకాల సమస్యలను సమన్వయం చేసుకుంటూ నిధుల కేటాయింపు జరపాల్సిన ఆవశ్యకత ఉంది. భారీగా ఏర్పడిన ద్రవ్య లోటును ప్రభుత్వం ఏ విధంగా పూడ్చుకుంటుందనే విషయంపై సందిగ్ధం నెలకొంది.

బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులతో నిర్మల

మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం

వృద్ధికి కీల‌కంగా పరిగణించే మౌలిక స‌దుపాయాల‌పై ప్రత్యేకంగా దృష్టిపెడతామని నిర్మలా సీతారామన్ ఇదివరకే స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం రావాలంటే ఈ రంగంపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉంది. గతకొన్నేళ్లుగా ప్రభుత్వం సైతం దీన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తోంది. మౌలికంతో పాటు విద్య, వైద్యం, సేవా రంగాల వ్యయాన్ని పెంచడంపైనా దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు.

వైద్య రంగంపై పెట్టుబడులు

కరోనా మహమ్మారి వైద్యారోగ్య రంగంలో లోటుపాట్లను ఎత్తిచూపించింది. ఈ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఎంత ముఖ్యమో గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్​లో ఆ దిశగా కీలక నిర్ణయాలు ఉంటాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఏ రంగాలకు లేని విధంగా ఈసారి ఆరోగ్య రంగానికి బడ్జెట్లో కేటాయింపులు అవసరమని సూచిస్తున్నారు.

నిపుణుల సూచనలు

  • వైద్య సంరక్షణపై ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి.
  • అవసరాలకు తగ్గట్లు జాతీయ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలతో వైద్య రంగంలో సిబ్బందిని పెంచుకోవాలి.
  • వైద్య కళాశాలల సంఖ్య పెరగాలి.
  • ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో స్థానికంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించాలి.
  • జీడీపీలో వైద్య రంగానికి కేటాయింపులు 2 శాతానికి పెరగాలి.

నిరుద్యోగ సమస్యపై...

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. కరోనాకు ముందే దేశంలో నిరుద్యోగం తాండవించింది. మహమ్మారి వ్యాప్తితో ఈ సమస్య మరింత తీవ్రమైంది. లక్షల మంది ఉపాధికి దూరమయ్యారు. లాక్​డౌన్ వల్ల వలస కార్మికులు గ్రామాలకు తరలివెళ్లారు. ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడిప్పడు కోలుకుంటున్నప్పటికీ.. వీరిలో చాలా మంది ఇంకా నిరుద్యోగులుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో స్వల్పకాల నిరుద్యోగాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగించాలి. మార్కెట్లు, కోల్డ్ స్టోరేజీలు వంటి సదుపాయాల నిర్మాణాల్లో వీరికి ఉపాధి కల్పించాలి.

వ్యవ'సాయం' అందేనా?

వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులు రైతుల్లో ఆగ్రహజ్వాలలను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:పద్దు 2021:​ కొత్తదనంతో ముందుకు 'సాగు'

ఈ రంగంలో ఏళ్లుగా నెలకొని ఉన్న నాణ్యతలేమి, తక్కువ ఉత్పాదకత వంటి సవాళ్లను పరిష్కరించేందుకు కేంద్రం ప్రత్యేకంగా దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు వ్యవసాయ రంగాన్ని నేటి తరానికి తగ్గట్టుగా మార్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సాంకేతికత వినియోగం పెరిగేలా చూడాలని... మార్కెట్ల అనుసంధానం, రైతులకు సలహాలు ఇచ్చే వ్యవస్థలు, యాంత్రీకరణ, రవాణ, శీతలీకరణ గిడ్డంగులు, కాంట్రాక్టింగ్‌ విధానాలు, కచ్చితమైన వాతావరణ సమాచారం వంటి అంశాలు భారత్‌లో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. వ్యవసాయ రుణాలు పెంచేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా వల్ల దేశ పారిశ్రామిక, తయారీ రంగాలు ఒడుదొడుకులు ఎదుర్కొన్న సమయంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలే ఆర్థిక వ్యవస్థకు ఆసరాగా నిలిచాయి. ఒత్తిడిలోనూ రాణించి తమ సత్తా చాటాయి. ఈ నేపథ్యంలో ఆయా రంగాలపై కేంద్రం వరాల జల్లు కురిపిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

పన్ను శ్లాబుల సంగతేంటి?

ఇదీ చదవండి: బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రాయితీలు!

బడ్జెట్‌ అనగానే సగటు మనిషి ఎదురుచూసేది ఆదాయపు పన్ను శ్లాబు గురించే. వార్షికాదాయం రూ.5లక్షల వరకు పన్ను మినహాయింపు కల్పించాలన్న డిమాండ్‌ చాలా ఏళ్లుగా ఉంది. ప్రస్తుతం రెండు రకాల ఆదాయపు పన్ను మదింపు పద్ధతులున్నాయి. ఇందులో ఒకటి 'అన్ని మినహాయింపులు పొందుతూ.. పన్ను చెల్లించడం', మరొకటి 'మినహాయింపులేమీ లేకుండా ఆదాయానికి వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను కట్టడం'.. ఈ రెండు పద్ధతుల్లో ఏది ఎంచుకోవాలన్న విషయంలో ఇప్పటికీ పన్ను చెల్లింపుదారులకు సరైన అవగాహన లేదు. దీనికి బదులుగా ఆదాయపు పన్ను శ్లాబులను సవరించడమే లాభమని ప్రజలు కోరుకుంటున్నారు. ఆర్థిక మంత్రి ఈ విషయంలో ప్రజలకు మేలు చేయాలనుకుంటే.. రూ.5 లక్షల వార్షికాదాయం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తూ.. శ్లాబులను సవరిస్తే పెద్ద ఊరట లభించినట్లే.

వృద్ధికి బాటలు పరిచేలా పద్దు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం క్షీణతను నమోదు చేయొచ్చని ఆర్థిక సర్వే 2020-21 అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం జీడీపీ 11 శాతం పెరుగుతుందని లెక్కగట్టింది.

ఆర్థిక వృద్ధి కోసం బడ్జెట్​లో ఏ విధమైన చర్యలు తీసుకునే విషయం సోమవారం తేలిపోనుంది. దీంతో పాటు ద్రవ్యలోటును అధిగమించడం, ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించే దిశగా అడుగులు వేయడం వంటి అంశాలు ఈ బడ్జెట్‌లో కీలకం కానున్నాయి. ఈ సవాళ్లకు ఎలాంటి పరిష్కార మార్గాలు చూపుతారో చూడాలి మరి!

బడ్జెట్​పై ప్రత్యేక కథనాలు:

ABOUT THE AUTHOR

...view details