భారత్‌లోని 63 మంది బిలియనీర్ల సంపద మొత్తం కలిపితే దేశ వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువే ఉంటుందని అంతర్జాతీయ హక్కుల సంస్థ ‘ఆక్స్‌ఫామ్’ నివేదిక పేర్కొంది. దేశంలో ఒక శాతంగా ఉన్న ధనవంతుల వద్ద 70 శాతం మంది పేదల వద్ద ఉన్న మొత్తం సంపద కంటే నాలుగు రెట్లుకు మించి అధిక సంపద ఉన్నట్లు ఈ సర్వే స్పష్టం చేసింది.
'70% పేదలకంటే ఒక శాతం ధనికుల సంపదే ఎక్కువ' - Wealth of India's richest 1% more than 4-times of total for 70% poorest: Oxfam
దేశంలో ఆర్థిక అసమానతలు మరింత పెరిగినట్లు అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ సర్వే తెలిపింది. దేశంలో ఉన్న కోటీశ్వరుల సంపద వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువే ఉంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది. లింగ భేదాల వల్లే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని వివరించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4.6 బిలియన్ల మంది పేదలకంటే 2,153 మంది బిలియనీర్ల వద్దే అధిక సంపద ఉన్నట్లు లెక్కగట్టింది ఆక్స్‌ఫామ్. 50వ ప్రపంచ వార్షిక ఆర్థిక సదస్సు వేదిక సందర్భంగా సర్వే వివరాలను వెల్లడించింది. గత దశాబ్దంలో కోటీశ్వరుల సంఖ్య రెండింతలైందని సర్వే తెలిపింది. ఆర్థిక అసమానతలు రూపుమాపే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సి ఉందని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా చాలా తక్కువ దేశాలు అడుగులు వేస్తున్నాయని వెల్లడించారు.
నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు...
- ఒక టెక్ కంపెనీ సీఈఓ సంవత్సరంలో ఆర్జించే మొత్తాన్ని సంపాదించడానికి ఒక సాధారణ గృహిణికి 22,277 సంవత్సరాలు పడుతుంది. సెకనుకు సగటున రూ.106 చొప్పున 10 నిమిషాల్లో ఓ సీఈఓ సంపాదించే మొత్తాన్ని ఆర్జించడానికి మహిళకు ఒక ఏడాది సమయం పడుతుంది.
- దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలు రోజుకు 3.26 బిలియన్ల గంటలు ఎలాంటి భత్యం లేకుండా పని చేస్తున్నారు. ఈ లెక్కన వారంతా కలిసి ఏడాదికి సంపాదించగలిగే రూ.19 లక్షల కోట్ల మొత్తం భారత విద్యాశాఖ బడ్జెట్ కంటే 20 రెట్లు ఎక్కువ.
- జీడీపీలో రెండు శాతంగా ఉన్న సంక్షేమ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల్ని నేరుగా అనుమతించడం వల్ల 2018లో కోల్పోయిన 11 మిలియన్ల ఉద్యోగాల్ని తిరిగి సృష్టించవచ్చు.
- ప్రపంచంలోని తొలి 22 మంది ధనవంతుల సంపద.. ఆఫ్రికాలో ఉన్న మొత్తం మహిళల సంపద కంటే ఎక్కువ.
- ప్రపంచ అత్యంత ధనవంతుల్లో 1శాతం మంది పదేళ్లపాటు తమ సంపదపై 0.5శాతం అధిక పన్ను చెల్లిస్తే వృద్ధులు, బాలల సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాల్లో 117 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించొచ్చు.
TAGGED:
Gangadhar Y