సంఘటిత రంగాల్లో ఉద్యోగాలు తగ్గిపోవడం, వ్యవసాయ రంగంలో పంటలు వేసే సమయం దాదాపు ముగియటం వల్ల ఆగస్టులో దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు మళ్లీ పెరిగింది.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) డేటా ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 9.83 శాతానికి పెరిగింది. జులైలో ఇది 9.15 శాతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే పట్టణ ప్రాంతాల్లో ప్రతి పది మందిలో ఒకరికి ఉపాధి కరువైనట్లు సీఎంఐఈ సర్వే తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆగస్టులో నిరుద్యోగ రేటు 6.66 శాతం (జులైలో) నుంచి 7.65 శాతానికి పెరిగిందని సీఎంఐఈ వెల్లడించింది.
మొత్తం నిరుద్యోగ రేటు.. ఆగస్టులో 8.35 శాతానికి పెరిగినట్లు సీఎంఐఈ తెలిపింది. జులైలో ఇది 7.43 శాతంగా ఉండటం గమనార్హం. లాక్డౌన్ ఉన్న మే, జూన్‌తో పోలిస్తే జులైలో కాస్త తగ్గిన నిరుద్యోగ సమస్య ఆగస్టులో మళ్లీ పెరిగింది.