తెలంగాణ

telangana

ETV Bharat / business

మాంద్యం నుంచి భారత్ U-షేప్ రికవరీ.. ఇంతకీ U అంటే?

కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర మాంద్యం నెలకొంది. అయితే ఈ సంక్షోభం తాత్కాలికమేనని.. ఆర్థిక వ్యవస్థ V లేదా U-షేప్​ రికవరీని సాధిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ U-షేప్ రికవరీ అంటే ఏమిటి? ఆర్థిక వృద్ధిని అంచనా వేసేందుకు ఇంకా ఏవైనా షేప్​లు ఉన్నాయా? ఉంటే వాటన్నింటిని ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయాలన్నీ వివరంగా మీ కోసం.

Various shapes of economic recovery
ఆర్థిక రికవరీని సూచించే ఆకారాలు ఇవే

By

Published : Jul 26, 2020, 1:15 PM IST

కరోనా వల్ల భారత్​ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. ఇంకా చెప్పాలంటే గతంలో ఎన్నడూ చూడనంత తీవ్ర మాంద్యంలోకి జారుకున్నాయి చాలా దేశాలు. ఈ సంక్షోభం నుంచి భారత్ సహా ప్రపంచ దేశాలు వేగంగానే కోలుకుంటాయని అంచనా వేస్తున్నారు ఆర్థికవేత్తలు. రేటింగ్ ఏజెన్సీలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

ఆర్థిక వ్యవస్థ రికవరీ... V-షేప్, U-షేప్ లేదా W-షేప్​గా ఉండొచ్చని ప్రధానంగా అంచనాలు ఉన్నాయి.

భారత వ్యయాల కార్యదర్శి టీ.వీ. సోమ్​నాథ్​ కూడా ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థపై పలు అంచనాలు వెల్లడించారు. కరోనా సంక్షోభం తర్వాత V-షేప్ రికవరీని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఈ అంచనాలతో చాలా మందికి V-షేప్ రికవరీ అంటే ఏమిటి? అనే సందేహం మొదలైంది. ఇంతకు V-షేప్ రికవరీని ఎలా అర్థం చేసుకోవాలి? ఆర్థిక వ్యవస్థ రికవరీని సూచించేందుకు ఇంకా ఏమైనా ఆకారాలు ఉన్నాయా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మాంద్యం వంటి సంక్షోభ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే విధానాలపై అంచనా వేయడానికి, వృద్ధి రేటును సూచించేందుకు L,U,V,W,Z, స్వూష్ ఆకారాలను వాడుతుంటారు ఆర్థికవేత్తలు.

V-షేప్ రికవరీ..

ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యంలోకి జారుకున్నప్పటికీ.. వేగంగా రికవరీ సాధిస్తుందనే విషయాన్ని సూచించేందుకు V-షేప్ రికవరీని వాడుతారు. స్పష్టంగా చెప్పాలంటే మాంద్యం నెలకొన్న ఏడాది కాలంలోపు.. మాంద్యం ముందున్న స్థాయికి ఆర్థిక వ్యవస్థ చేరుతుంది అనే విషయాన్ని V-షేప్ రికవరీతో సూచిస్తారు. ఆర్థిక వ్యవస్థకు మాంద్యం వల్ల శాశ్వత నష్టం వాటిళ్లదనే విషయాన్ని ఈ ఆకారం స్పష్టం చేస్తుంది.

U-షేప్ రికవరీ..

U-షేప్ రికవరీ కూడా V రికవరీ మోడల్​ను పోలి ఉంటుంది. మాంద్యం ప్రభావం V-షేప్​ కన్నా కాస్త ఎక్కువ సమయం ఉన్నప్పటికీ.. వేగంగానే తిరిగి రికవరీ సాధిస్తుందనే అంశాన్ని చెప్పేందుకు U-షేప్ రికవరీని వినియోగిస్తుంటారు.

W-షేప్ రికవరీ..

దీన్నే ఆర్థికవేత్తలు డబుల్​ డిప్​ మాంద్యం లేదా డబుల్ డిప్ రికవరీ అని కూడా పిలుస్తుంటారు.

ఈ విధానంలో ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుని స్వల్ప కాలంలోనే రికవరీ దిశగా కదులుతుంది. అయితే మళ్లీ వెంటనే మాంద్యంలోకి జారుకుంటుంది. ఇలా వరుసగా రెండు సార్లు మాంద్యంలోకి జారుకున్నాక వేగంగా రికవరీ సాధిస్తుంది అనే విషయాన్ని వివరించేందుకు W-షేప్ రికవరీని వాడుతారు.

L-షేప్ రికవరీ..

తీవ్ర ఆర్థిక మాంద్యానికి సూచికగా L-షేప్ రికవరీని వాడుతుంటారు ఆర్థికవేత్తలు. ఉదాహరణకు ఏదైనా కారణంతో ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటే.. చాలా కాలంపాటు ఆ సంక్షోభం కొనసాగుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని తెలిపేందుకు L-షేప్​ను ఉపయోగిస్తారు.

Z-షేప్ రికవరీ..

వేగవంతమైన రికవరీని సూచించేందుకు Z-షేప్ రికవరీని వినియోగిస్తారు. ఇంకా చెప్పాలంటే V-షేప్ కన్నా వేగంగా రికవరీ నమోదవుతుందనేందుకు ప్రతీకగా Z-షేప్ రికవరీని వాడుతుంటారు. సంక్షోభం ముందున్న దానికంటే.. ఇంకా ఎగువ స్థాయికి ఆర్థిక వ్యవస్థ చేరుతుందనే విషయాన్ని కూడా Z-షేప్ రికవరీ ద్వారానే సూచిస్తారు.

స్వూష్ రికవరీ..

స్వూష్ అనేది నైకీ సింబల్​ను పోలివుండే రికవరీ షేప్. సంక్షోభం తర్వాత నెమ్మదిగా, అంచెలంచెలుగా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే విధానాన్ని అర్థం చేసుకునేందుకు స్వూష్​ను వాడతారు విశ్లేషకులు.

ఆర్థిక వ్యవస్థలో రికవరీ షేప్​లు నిజంగానే ఉంటాయా?

ఆర్థిక వ్యవస్థ రికవరీని.. ఈ షేప్​లు నిజంగానే పాటిస్తాయా? అంటే కాదనే చెప్పాలి. నిజానికి ఆర్థిక వ్యవస్థ వృద్ధి అనేది డిమాండ్, సప్లయిలను ఆధారంగా చేసుకుని ఉంటుంది. ఈ షేప్​లు అన్నీ దృష్య రూపంలో వృద్ధిని అర్థం చేసుకునేందుకు వినియోగించే పద్ధతులు మాత్రమేనని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాశ్​ చంద్ర గార్గ్ ఈటీవీ భారత్​తో తెలిపారు.

భారత్ ఈ ఏడాది 10 శాతం వృద్ధి క్షీణతను చవి చూస్తుందని అంచనా వేశారు గార్గ్​. 2021-22లో రికవరీ U-షేప్​లో ఉండొచ్చని వెల్లడించారు.

ఇదీ చూడండి:వీధి వ్యాపారుల 'సూక్ష్మ రుణ పథకాన్ని' సమీక్షించిన పీఎం

ABOUT THE AUTHOR

...view details