ప్రభుత్వం ప్రైవేటీకరణకు ఎంపిక చేయనున్న రెండు బ్యాంకులు తమ ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) ప్రకటించే వీలుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే వీఆర్ఎస్ ఆఫర్ బలవంతంగా ఉద్యోగులను తప్పించేందుకు కాదని.. ప్రైవేటీకరణకు ముందే మంచి ప్యాకేజీతో రిటర్మెంట్ కోరుకునే వారి కోసమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లు తెలిసింది.
గతంలో పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియకు ముందు కూడా వీఆర్ఎస్ను ప్రకటించడం గమనార్హం.
2021-22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఓ బీమా సంస్థను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రైవేటీకరణకు అనుగుణంగా ఉన్న బ్యాంకుల ఎంపిక బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించింది కేంద్రం.