దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను సానుకూలానికి సవరించింది ఎస్&పీ గ్లోబల్ రేటింగ్స్. కరోనా సంక్షోభం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ -9 శాతం క్షీణిస్తుందన్న క్రితం అంచనాను.. తాజాగా -7.7 శాతానికి పరిమితం చేసింది.
వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు ఏకంగా 10 శాతానికి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
డిమాండ్ పెరగటం, కొవిడ్ సంక్రమణల రేటు తగ్గటం వంటి కారణాలతో.. వృద్ధి రేటు అంచనాలను సానుకూలానికి సవరించినట్లు ఎస్&పీ వెల్లడించింది. ముఖ్యంగా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆశించిన స్థాయికన్నా వేగంగా ఆర్థిక వ్యవస్థ రికవరీ సాధించినట్లు వివరించింది. తయారీ రంగంలో.. ఆసియా పసిఫిక్ దేశాల్లో వేగంగా పుంజుకుంటున్న దేశంగా భారత్ నిలవడం ఆశ్చర్యం కలిగించినట్లు ఎస్&పీ పేర్కొంది.
ఇటీవలే మరో రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ కూడా దేశ ఆర్థిక వ్యవస్థ 2020-21 వృద్ధి రేటు అంచనాలను.. -10.5 నుంచి -9.4 శాతానికి సవరించింది.
ఇదీ చూడండి:'రైతుల ఆందోళనతో రోజుకు రూ.3,500 కోట్లు నష్టం'