మహా నగరాలు దిల్లీ-ముంబయి మధ్య రూ. లక్ష కోట్లతో చేపట్టనున్న ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంతో పెట్టుబడిదారులకు భారీ అవకాశాలు రానున్నట్లు తెలిపారు కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ. ఈ రహదారి వెంట రానున్న టౌన్షిప్లు, స్మార్ట్ విలేజీలు, రహదారి పక్కన నిర్మాణాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని క్రీడాకారులను ఆహ్వానించారు. ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, పట్టణ ప్రణాళిక అసోసియేషన్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయా అంశాలను పేర్కొన్నారు గడ్కరీ.
దిల్లీ నుంచి ముంబయికి వెళ్లేందుకు 12 గంటల మేర ప్రయాణ సమయం తగ్గించనున్న ఈ రహదారి వెంట.. లెదర్, ప్లాస్టిక్, రసాయనాల పరిశ్రమలు సహా ఇతర సంస్థల ఏర్పాటుకు వ్యాపారవర్గాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి.
"ఈ నూతన రహదారి హరియాణా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లో తీవ్రంగా వెనకబడిన ప్రాంతాల గుండా సాగుతుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలపై ఒత్తిడి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ రహదారి వ్యాపార వర్గాలకు అనేక పెట్టుబడి అవకాశాలు కల్పిస్తుంది."
-నితిన్ గడ్కరీ