ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ ఏడాదిలో ఇప్పటికే 115 బేసిస్ పాయింట్లు.. అంతక్రితం ఏడాది 135 బేసిస్ పాయింట్ల మేర కోత విధించిన ఆర్‌బీఐ గురువారం ప్రకటించిన పరపతి విధాన సమీక్షలో రేట్లలో మార్పులు చేయలేదు. అయితే వృద్ధికి ఊతం అవసరమయ్యేంత వరకు సర్దుబాటు ధోరణి విధానాన్ని కొనసాగించడానికి కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించడం విశేషం.
రుణ పునర్నిర్మాణాలు..
- కార్పొరేట్, రిటైల్ రుణ స్వీకర్తలకు ఆర్‌బీఐ భారీ ఊరటనిచ్చింది. కరోనా వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్న వీరికి వన్‌టైం రుణ పునర్నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మార్చి 1, 2020 నాటికి 30 రోజుల కంటే ఎక్కువ డిఫాల్ట్ కాని కంపెనీల రుణాల పునర్నిర్మాణానికి బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. రెండేళ్ల పాటు రుణాల కొనసాగింపునకూ ఆమోదముద్ర వేసింది. ఇందు కోసం బ్యాంకులు కొన్ని కేటాయింపులను పక్కకు పెట్టాల్సి వస్తుంది.
- కరోనా ప్రభావం పడ్డ చిన్న, మధ్య తరహా కంపెనీ(ఎస్‌ఎమ్‌ఈ)ల రుణాల పునర్నిర్మాణానికి ప్రత్యేక గవాక్షం ఉంటుందని స్పష్టం చేసింది. 2020లో ఏ సమయంలోనైనా పరిష్కార ప్రణాళికను మొదలుపెట్టవచ్చని.. మొదలుపెట్టిన 180 రోజుల్లోగా అమలు చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు.
- కార్పొరేట్ బ్రిక్స్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ కేవీ కామత్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.
- ప్రాధాన్య రంగ రుణాల(పీఎస్‌ఎల్) పరిధిని పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. అందులోకి అంకురాలను చేర్చింది. పునరుత్పాదక ఇంధన రంగాలకు రుణ పరిమితిని సైతం పెంచింది.
గృహ రుణాలు, చిన్న రుణాలకు ఊతం
చిన్న రుణాలిచ్చేవారు, గృహ రుణ కంపెనీలకు సహాయం చేయడం కోసం నాబార్డ్, ఎన్‌హెచ్‌బీలకు అదనపు ప్రత్యేక ద్రవ్యలభ్యత సదుపాయం (ఏఎస్‌ఎల్‌ఎఫ్) కింద రూ.5,000 కోట్ల చొప్పున మొత్తం రూ.10,000 కోట్లను ప్రకటించింది. రెపో రేటు వద్దే వీటికి ఈ రుణాలు లభిస్తాయని దాస్ తెలిపారు.