2019-20లో రిజర్వు బ్యాంకు నుంచి ప్రభుత్వానికి రూ. 69 వేల కోట్ల డివిడెండ్ రానున్నట్లు ఆర్థికశాఖ అంచనా వేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, జాతీయ బ్యాంకులతో పాటు మిగతా ఆర్థిక సంస్థల నుంచి మిగులు నిధులు, డివిడెండ్ రూపంలో రూ. 82,911.56 కోట్లు సమీకరించాలనుకుంటోంది.
మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసినట్లు రూ. 28వేల కోట్లు డివిడెండ్‌కు ఆర్బీఐ బోర్డు అంగీకరించినట్లయితే 2018-19 సంవత్సరానికి మిగులు నిధుల బదిలీ రూ. 68వేల కోట్లను చేరుతుంది. ఆర్బీఐ జులై-జూన్ ఆర్థిక సంవత్సరాన్ని అనుసరిస్తోంది. దీని ప్రకారం ఇప్పటికే రూ. 40 వేల కోట్లను ప్రభుత్వానికి కేంద్ర బ్యాంకు అందించింది.
ఆర్థిక లోటు...
ఆర్బీఐ డివిడెండ్‌తో సహా పలు సంస్థల నుంచి నిధుల రాకతో ప్రభుత్వ ఆర్థిక లోటు తగ్గింది. ప్రభుత్వం చేసే ఖర్చుకు, వచ్చే ఆదాయానికి మధ్యనున్న తేడాలే ఈ ఆర్థిక లోటు.
మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం 2020 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు లక్ష్యాన్ని 3.4 శాతంగా నిర్దేశించుకుంది. దీనిని 2020-21లో 3 శాతానికి తగ్గించి ప్రాథమిక లోటు లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఓ ప్రణాళికతో వచ్చింది. ఆర్థిక లోటు నుంచి వడ్డీ చెల్లింపులను తీసేయగా వచ్చేదే ప్రాథమిక లోటు. 2021-22లో సున్నా ప్రాథమిక లోటును సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
2018-19 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రాథమిక లోటు రూ.48,481 కోట్లు. ఇది జీడీపీలో 0.3 శాతానికి సమానం. ఇది సవరించిన అంచనాల్లో రూ. 46,828 కోట్లతో, జీడీపీలో 0.2 శాతంగా ఉంది.
ప్రాథమిక లోటు తగ్గుదల ఒక సానుకూల పరిణామం. ఇది ఇప్పటికే ఉన్న రుణాలకు వడ్డీ చెల్లించటానికి కొత్త రుణాలపై ఆధారపడటంలో తగ్గుదలను చూపెడుతోంది.