దేశంలో కరోనా రెండో దశ అస్థిరతలు, ద్రవ్యోల్బణం(Inflation Fears) భయాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనితో ఈ సారి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షలోనూ.. రెపో రేటు యథాతథంగా ఉంచే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రెపో రేటు (Repo rate now) 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు(Reverse Repo rate now) 3.35 శాతం వద్ద ఉన్నాయి. గత ఏడాది మేలో చివరి సారిగా రెపో, రివర్స్ రెపో రేట్లను సవరించింది ఆర్‌బీఐ.
తదుపరి ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమీక్ష జూన్ 2న ప్రారంభం కానుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కమిటీ నిర్ణయాలను జూన్ 4న వెల్లడించనున్నారు.
స్థూల ఆర్థిక పరిస్థితులు 2021-22లో ఎంపీసీ సమీక్షలకు మార్గ నిర్దేశం చేయనున్నట్లు ఆర్‌బీఐ గత వారం విడుదల చేసిన వార్షిక నివేదిక (RBI Annual report) ద్వారా స్పష్టమైంది. ముఖ్యంగా వృద్ధికి ఊతమిచ్చే, ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టే నిర్ణయాలకు కమిటీ ప్రాధాన్యమివ్వచ్చని కూడా తెలిసింది.