కరోనా ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అర్బీఐ ఏడాది కాలంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా కీలక వడ్డీ రేట్లను చివరగా.. గత ఏడాది మేలో అత్యల్ప స్థాయికి (రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం) తగ్గించింది. కరోనా భయాల నేపథ్యంలో తదుపరి సమావేశాల్లోనూ అవే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది.
ఈ వారం ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష నిర్వహించి.. ప్రస్తుత పరిస్థితులకు తగ్గ నిర్ణయాలను తీసుకోనుంది. అయితే ఈసారి కూడా కీలక వడ్డీ రేట్ల విషయంలో.. యథాతథ స్థితినే కొనసాగించేందుకు కమిటీ మొగ్గు చూపొచ్చని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.
ఆగస్టు 4న ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ప్రారంభమవనుంది. మూడు రోజుల సమీక్ష అనంతరం ఆగస్టు 6న వడ్డీ రేట్లు సహా ఇతర నిర్ణయాలను ప్రకటించనుంది ఆర్బీఐ.