'ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ హానరింగ్ ద హానెస్ట్' ప్లాట్‌ఫాంను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. కరోనా సంక్షోభంతో మందగించిన ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు పన్ను వ్యవస్థలో ఈ వేదిక ద్వారా మరిన్ని సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలిపారు.
ప్రత్యక్ష పన్ను విధానాన్ని ఇంకా సులభతరం చేసి, నిజాయతీగా పన్ను చెల్లిస్తున్న వారికి బహుమతులు ఇవ్వాలనే లక్ష్యంతో 'పారదర్శక పన్ను విధానం' వేదికను ఏర్పాటు చేశామన్నారు మోదీ.
నిజాయతీకి ప్రోత్సాహం..
"ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు అవసరం. ప్రత్యేక వేదిక ద్వారా సులువుగా ఫిర్యాదులు చేయవచ్చు. పన్ను చెల్లింపుదారులు మరింత పెరిగేందుకు ప్రత్యేక వేదిక దోహదం చేస్తుంది. నిజాయతీగా పన్ను చెల్లించేవారికి ప్రత్యేక వేదిక ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరం ఉంది."