వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక స్థితిగతుల మార్పే లక్ష్యంగా వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. పక్కా ప్రణాళికలతో ఆర్థిక సంస్కరణలకు ఆచరణ మార్గాల్ని ప్రస్తావిస్తూ తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్.
దేశ ఆర్థిక వ్యవస్థకు జీవన రేఖలుగా భావించే మౌలిక వసతులు, ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది మోదీ 2.0 సర్కారు. గ్రామాలు-పట్టణాల మధ్య అంతరాల్ని తగ్గించేలా రవాణా మార్గాలకు ప్రాధాన్యమిచ్చింది. నిర్ణీత కాలపరిమితితో అందరికీ ఇళ్లు,ఇంటింటికీ నీరిస్తామని స్పష్టం చేసింది. యువత, మహిళలు, రైతులు, పేదలు ఇలా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే పథకాల్ని ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి నవీన భారత నిర్మాణమే లక్ష్యమని ఉద్ఘాటించారు.
ఉపాధి కల్పనపై...
గత 45 ఏళ్లలో ఎన్నడూ చూడని నిరుద్యోగంతో యువత ఉక్కిరిబిక్కిరవుతోంది. సాంకేతికతతో మరిన్ని ఉద్యోగాలు ఊడిపోతాయన్న అంచనాల మధ్య ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కేంద్రం భారీ పరిశ్రమలు స్థాపించే బహుళజాతి సంస్థలను దేశంలోకి ఆహ్వానించేందుకు త్వరలోనే నూతన విధానాన్ని ప్రకటిస్తామని తెలిపింది.
పన్ను మినహాయింపు లేనట్లే...
మోదీ 2.0 ప్రభుత్వం తొలి బడ్జెట్‌లో పన్ను మినహాయింపు కల్పిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసిన సగటు భారతీయుడికి నిరాశే మిగిలింది. ఆదాయ పన్నులు యథాతథమని ప్రకటించారు నిర్మలా సీతారామన్. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితుల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. రూ. 5 లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను ఉండదన్నారు.
అయితే మధ్యతరగతిగృహ రుణగ్రహీతలకు మరికాస్త ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసింది. 2020 మార్చి వరకు గృహ రుణాల వడ్డీపై రూ .1.50 లక్షల అదనపు పన్ను మినహాయింపును కల్పిస్తున్నట్లు తెలిపింది. ఫలితంగా వడ్డీ రాయితీ రూ.2 లక్షల నుంచి రూ.3.50 లక్షలకు పెరగనుంది.
రూ.45 లక్షలలోపు గృహ రుణాలపై ఈ రూ.3.50 లక్షలు వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. విద్యుత్ వాహనాల కొనుగోలు కోసం తీసుకున్న రుణాలపైనా రూ. 1.50 లక్షల ఆదాయ పన్నును తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
సుంకాల మాటేంటి...?
దేశ రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపిన నిర్మలా సీతారామన్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రక్షణరంగ వస్తువులపై పూర్తిస్థాయి ప్రాథమిక సుంకాన్ని తొలగిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దృష్టిలో పెట్టుకొని పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 2 రూపాయల మేర సుంకం పెంచుతున్నట్లు తెలిపారు.బంగారం సహా ఇతర విలువైన ఆభరణాలపై రెండున్నర శాతం సుంకం మోపారు.
కస్టమ్స్ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో సవరణలను నిర్మల ప్రతిపాదించారు.
బ్యాంకింగ్ రంగ ప్రక్షాళన...