తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇక పెట్రో మంట మొదలు.. రోజుకు 50 పైసలు పెంపు?

Petrol Diesel Prices: ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యా.. తనపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలపై కన్నెర్ర చేసింది. తమ దేశ చమురు దిగుమతులపై ఆంక్షలు విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. జర్మనీకి తక్షణమే గ్యాస్‌ సరఫరా ఆపేస్తామన్న రష్యా ముడిచమురు ఉత్పత్తిని తగ్గిస్తామని స్పష్టం చేసింది. అదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ధర 300 డాలర్లకు చేరుతుందని పేర్కొంది. ప్రస్తుతం బ్యారెల్‌ ధర 125 డాలర్లకు చేరితేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. భారత్​లో రోజుకు 50 పైసల చొప్పున ఇంధన ధరల్లో పెరుగుదల ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

petrol diesel prices hike soon india
petrol diesel prices hike soon india

By

Published : Mar 8, 2022, 2:28 PM IST

Petrol Diesel Prices: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల.. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. యుద్ధం అంతకంతకూ తీవ్రం కావడం రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా ముడిచమురు ధరలకు రెక్కలొచ్చాయి. రష్యా నుంచి చమురు దిగుమతులపై కూడా.. అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించాలని యోచిస్తుండగా, సోమవారం చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్‌ నుంచి ముడి చమురు ఎగుమతుల పునరుద్ధరణ ఆలస్యం కావొచ్చనే అంచనాలు సైతం.. ధర భారీగా పెరిగేందుకు కారణమైంది. సోమవారం 139.14 డాలర్లను తాకిన బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర ప్రస్తుతం 125 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. చమురు ధరలు ఎగబాకుతున్న కొద్దీ ఇతర కమొడిటీ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలు.. రూపాయి పతనానికి దారితీస్తున్నాయి. సోమవారం డాలరుతో పోలిస్తే 77.44 వద్ద జీవితకాల కనిష్ఠాన్ని తాకిన రూపాయి విలువ, ప్రస్తుతం 76.76 వద్ద ట్రేడవుతోంది. అయితే ముడిచమురు సరఫరా విషయంలో ప్రస్తుతం భారత్‌కు ఎలాంటి ఇబ్బందుల్లేకున్నా ధరలు మాత్రం కలవరపెడుతున్నాయి.

Oil Requirement: చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే మనదేశం ఆధారపడుతోంది. చమురు ధరల పెరుగుదలతో ఆసియాలో అత్యంత భారీ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న దేశంగా భారత్‌ నిలుస్తోంది. చమురు ధరల పెరుగుదల, రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. ద్రవ్యోల్బణ భయాలకు తోడు వృద్ధి మందగిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఒక్కో బ్యారెల్ చమురుకు 10 డాలర్లు పెరిగిన కొద్దీ.. దేశ ప్రస్తుత కరెంటు ఖాతా లోటు 14-15 బిలియన్‌ డాలర్లు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Fuel Prices India: మరోవైపు గత నాలుగు నెలలుగా పెట్రోల్, డీజిల్‌ ధరలను యథాతథంగా కొనసాగించిన చమురు సంస్థలు పెరిగిన ముడిచమురు భారాన్ని వినియోగదారులపై మోపక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే రిటైల్‌ ధరల్ని భారీ ఎత్తున పెంచక తప్పదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 15 రూపాయల వరకు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఒకేసారి ఈ భారాన్ని ప్రజలపై మోపకపోవచ్చని, రోజుకు 50 పైసల చొప్పున పెంచే అవకాశం ఉందని తెలిపారు.

మరోవైపు ఐరోపా దేశాల సహజవాయువు అవసరాల్లో 40 శాతం రష్యానే తీరుస్తోంది. రష్యా నుంచి ఐరోపాకు వెళ్లే గ్యాస్‌ పైప్‌లైన్లు మూడో వంతు.. ఉక్రెయిన్‌ నుంచే వెళుతున్నాయి. సహజవాయు ఉత్పత్తిలో రష్యా అగ్రస్థానంలో ఉండగా ప్రపంచ చమురు ఉత్పత్తిలో 10 శాతం వాటా ఆ దేశానిదే. ఈ పరిస్థితుల్లో.. తమ నుంచి ముడిచమురు దిగుమతులపై అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధిస్తే అంతర్జాతీయంగా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని రష్యా హెచ్చరించింది.

బ్యారెల్​ క్రూడ్​ 300 డాలర్లు?

జర్మనీకి గ్యాస్‌ సరఫరా ఆపేస్తామన్న రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్‌ నొవాక్ ముడిచమురు ఉత్పత్తిని కూడా తగ్గిస్తామని స్పష్టం చేశారు. అదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడిచమురు ధర.. 300 డాలర్లకు చేరుతుందన్నారు.ఇది ఐరోపాపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ఐరోపాకు కనీసం ఏడాది పడుతుందని గుర్తుచేశారు. అయినప్పటికీ రష్యా నుంచి ముడిచమురు దిగుమతులపై ఆంక్షలకే అమెరికా మొగ్గు చూపుతుండగా జర్మనీ, నెదర్లాండ్స్‌ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆంక్షల విషయంలో అమెరికా ముందుకెళితే.. ఐరోపాతోపాటు మన ఆర్థికవ్యవస్థపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:చుక్కలు చూపిస్తున్న చమురు.. బంగారం భగభగ

ఇక 'పెట్రో' మోత- రూ.12 పెంపు?

ఇక మూడు శ్లాబులే.. జీఎస్టీ కౌన్సిల్‌ యోచన?

ABOUT THE AUTHOR

...view details