తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఫారం-16'లో కీలక మార్పులు ఇవే - సీబీడీటీ

ఆదాయపన్ను శాఖ రిటర్నులో పారదర్శకతను పెంచేందుకు ఐటీఆర్ 'ఫారం-16' లో కీలక మార్పులు చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ). మే 12 నుంచి అమలులోకి రానున్న ఈ ఫారం మార్పులపై పూర్తి వివరాలు మీకోసం.

'ఫారం 16'లో కీలక మార్పులు

By

Published : Apr 28, 2019, 11:45 AM IST

ఏదైనా ఉద్యోగం చేస్తూ ఆదాయ పన్ను రిటర్నుకు దరఖాస్తు చేస్తున్నారా? అయితే ఈ సమాచారం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

ఆదాయ పన్ను రిటర్నులో సమర్పించే 'ఫారం 16'లో కీలక మార్పులు చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ). మే 12 నుంచి 'ఫారం-16'లో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.

2018-19 ఆర్థిక సంవత్సరం సహా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ నూతన ఫారంనే ఉపయోగించాలని సీబీడీటీ స్పష్టం చేసింది.

'ఫారం-16' అంటే?

ఉద్యోగుల వేతనం నుంచి ప్రతి నెల యాజమాన్యం విధిస్తున్న కోతకు సంబంధించిన ధ్రువపత్రమే ఈ 'ఫారం-16'. ఇందులో ఆదాయ పన్ను శాఖకు సంస్థ యాజమాన్యం చెల్లిస్తున్న పన్ను వివరాలు ఉంటాయి.

అందుకే ఆదాయ పన్ను రిటర్ను సమయంలో 'ఫారం-16' చాలా ముఖ్యం. 'ఆదాయ పన్ను చట్టం-1961' ప్రకారం యాజమాన్యం తమ ఉద్యోగులకు 'ఫారం 16'ను జారీ చేయడం తప్పనిసరి.

బ్రేకప్​ ఆఫ్​ 'ఫారం 16'

'ఫారం-16' ని పార్ట్​- ఏ, పార్ట్-​ బి గా విభజించారు. 'పార్ట్-​ ఏ'లో ఉద్యోగి పేరు, చిరునామా, పన్ను చెల్లింపుదారు పాన్​ కార్డు వివరాలు, సంస్థ పాన్​ వివరాలు, ఆదాయ పన్ను శాఖ వద్ద నమోదైన టీడీఎస్ వివరాలు ఉంటాయి.

'పార్ట్-​ బి' పార్ట్​-ఏ కు కొనసాగింపు. ఇందులో ఉద్యోగి జీతభత్యాల వివరాలు, అలవెన్సులు, 1961 ఐటీ చట్టంలోని సెక్షన్​ 80 ప్రకారం పలు రకాల డిడక్షన్​లను తెలపాల్సి ఉంటుంది.

ఫారం 16 మార్పులు పన్ను మినహాయింపు వివరాలు

ఇంతకు ముందు 'ఫారం-16'లో పన్ను మినహాయింపు వివరాలు సమర్పిస్తే సరిపోయేది. కానీ సీబీడీటీ చేసిన నుతన మార్పులతో 'సెక్షన్​ 10'లోని పలు సబ్​ సెక్షన్​ల కింద పన్ను మినహాయింపు వర్తించే ఆదాయం పూర్తి వివరాలు 'ఫారం 16' పార్ట్​- బిలో పొందుపరచాల్సి ఉంటుంది.

ఇందుకు సంబంధించి కచ్చితమైన ప్రమాణాలను తీసుకువచ్చింది సీబీడీటీ. దీని ప్రకారం ట్రావెల్ అలవెన్సులు, రిటైర్​ మెంట్​ గ్రాట్యుటీ, పెన్షన్​, ఇంటి అద్దె, ఇతర మార్గాల నుంచి ఎంత ఆదాయం వస్తుందనే వివరాలు పూర్తిగా పేర్కొనాల్సి ఉంటుంది.

పెట్టుబడుల ద్వారా..

పన్ను చెల్లింపుదారులు కొన్ని రకాల పెట్టుబడులు, ఇతరత్ర మార్గాల ద్వారా 'సెక్షన్​-80'లోని '80 సీ నుంచి 80 యూ' వరకు పన్ను మినహాయింపులు పొందొచ్చు.

ఇప్పటి వరకూ పెట్టుబడుల మొత్తం వివరాలు తెలిపితే సరిపోయేది. సీబీడీటీ చేసిన తాజా మార్పులతో జీవిత బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్​ పథకాలు, ఉన్నత చదువులకోసం వడ్డీకి తీసుకున్న రుణం, సేవింగ్స్​ అకౌంట్​పై పొందుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా వస్తున్న ఆదాయం పూర్తి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఇతర మార్పులు

ప్రామాణిక కోత (స్టాండర్డ్​ డిడక్షన్​)కు సంబంధించి ప్రత్యేక సెక్షన్​ను 'ఫారం-16'లో పొందుపరిచారు. 'టీడీఎస్' వర్తిస్తూ ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయ వివరాలు ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. మునుపటి సంస్థ నుంచి పొందిన జీతభత్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియజేయొచ్చు.

ABOUT THE AUTHOR

...view details