'5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కలలో.. ప్రతి ఒక్కరి పాత్ర' 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకునే ప్రక్రియలో దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా పాత్ర కీలకమైనదేనని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా ధర్మశాలలో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సును ప్రారంభించారు.
సులభతర వాణిజ్య విధానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ప్రపంచంలోని తొలి పది దేశాల జాబితాలో భారత్ ఉందన్నారు మోదీ. గత ఐదేళ్ల కాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జాబితాలో 79 స్థానాలు ఎగబాకినట్లు వివరించారు.
"దేశ ప్రగతి రథం నూతన ఆలోచనలు, కొత్త విధానాల సాయంతో నాలుగు చక్రాలపై నడుస్తోంది. అవి సమాజం, ప్రభుత్వం, పరిశ్రమలు, జ్ఞానం. ఈ నాలుగు చక్రాల సాయంతో మనం అభివృద్ధి దిశగా సాగుతున్నాం. ప్రస్తుత ప్రభుత్వం.. పేదల ఇళ్లు, ఆరోగ్యం, నైపుణ్యం మొదలైన అనేక విషయాలపై దృష్టిసారించింది. నిన్న సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ మధ్యతరగతి ప్రజల కలలను దృష్టిలో ఉంచుకుని ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం కారణంగా నాలుగున్నర లక్షల మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల సాకారం కానుంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: కర్తార్పుర్పై పాక్ ప్రధానిదో మాట- సైన్యానిది మరో మాట