తెలంగాణ

telangana

ETV Bharat / business

2018-19లో లక్ష్యాన్ని చేరని జీఎస్టీ వసూళ్లు

2018-19లో కేంద్ర వస్తు సేవల పన్ను నిర్దేశించుకున్న లక్ష్యం కంటే రూ.78 వేల కోట్లు తక్కువగా వసూలైంది. మార్చి నెలలో మాత్రం రూ.1.06 లక్షల కోట్ల రికార్డు వసూళ్లు అయ్యాయి.

By

Published : Apr 2, 2019, 6:09 AM IST

Updated : Apr 2, 2019, 6:48 AM IST

లక్ష్యాన్ని చేరని జీఎస్​టీ వసూళ్లు

2018-19 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర వస్తు సేవల పన్ను(సీజీఎస్టీ) వసూళ్లు లక్ష్యాన్ని అందుకోలేకపోయాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న దానికంటే రూ. 78 వేల కోట్లు తక్కువగా అంటే రూ.4.25 లక్షల కోట్లు మాత్రమే సమకూరాయి. మొత్తం జీఎస్టీ రూ. 11.47లక్షల కోట్లలో సీజీఎస్టీ రూ. 5.03లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది కేంద్రం.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కిసాన్​ సమ్మాన్​ నిధి పథకం కోసం ద్రవ్యలోటు అంచనాలను సవరించింది. కొత్త లక్ష్యమైన 3.4 శాతాన్ని సాధించటానికి కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ వసూళ్లు చాలా ముఖ్యం. ఒకవేళ పరోక్ష పన్నులు తగ్గినప్పుడు వేరే మార్గాల ద్వారా ఆదాయం సమకూరనట్లయితే ఈ లక్ష్యాన్ని అందుకోవటం సాధ్యపడదు.

మార్చిలో రికార్డు వసూళ్లు...

గత ఆగస్టు నుంచి జీఎస్టీ వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరిలో రూ. 97,247 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు... మార్చి నెలలో రూ. 1.06 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో సీజీఎస్టీ రూ. 20,535 కోట్లు, ఐజీఎస్టీ రూ. 50,418 కోట్లు, ఎస్​జీఎస్టీ రూ. 27,520కోట్లు, సెస్​ రూ.8,286 కోట్లు. క్రితం మార్చితో పోల్చితే ఇది 15.6 శాతం వృద్ధి చెందడం విశేషం. అయితే మార్చి నెలలోనే ఎక్కువ మంది జీఎస్టీ రిటర్నులు దాఖలు చేశారు.

జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ అనంతరం కూడా ఆదాయం పెరుగుతున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.

9.2 శాతం పెరుగుదల

2018-19లో నెలకు సగటు వసూళ్లు పెరిగాయి. క్రితం సంవత్సరంతో పోల్చితే 9.2శాతం పెరిగి రూ.98,114 కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.

మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.06 లక్షల కోట్లను చేరడం... తయారీ రంగం, వినియోగంలో వృద్ధికి అద్దం పడుతున్నాయి. - ట్విట్టర్​లో ఆర్థికమంత్రి అరుణ్​జైట్లీ

ఇదీ చూడండి:స్టార్టప్​: మోదీ చర్యలు X రాహుల్​ హామీలు

Last Updated : Apr 2, 2019, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details